భారత ‘స్వాతంత్య్రం’.. కొన్ని నిజాలు!

71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది.
అందుకే పంద్రాగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయ రోజుగా నిలిచిపోయింది. భారత స్వాతంత్య్రోద్యమం గురించి చాలా మంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్య్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనతోపాటు ఎవరెవరు…

ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచే మనం 71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజు భారత్‌తో పాటు కొరియా, కాంగో, బెహ్రయిన్, లీచెన్‌స్టీన్ దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

జపాన్ లొంగిపోయిన సందర్భంగా…

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవాలని ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ మన పెద్దలకు సూచించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తేదీనీ ఆయన సూచించారు. సింగపూర్‌లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్-ఈస్ట్ ఆసియా కమాండ్‌కు మౌంట్‌బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్‌గా వ్యవహరించారు.

మన జాతీయ గీతం.. ఆయన గౌరవార్థం..

జాతీయ గీతం ‘జన గణ మన’ను రబీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ ఐదవ జార్జ్ గౌరవార్థం ఠాగూర్ రంచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు.

ఆ నవలలోని రెండు చరణాలే.. మన జాతీయ గీతం..

జాతీయ గేయం ‘వందేమాతరం’ను బంకించంద్ర ఛటర్జీ రచించారు. వాస్తవానికి ఇదొక పద్య భాగం. ఛటర్జీ రచించిన ‘ఆనంద్‌మఠ్’ నవలలోని మొదటి రెండు చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించారు.

1857లోనే మొదలైన ఉద్యమం…

భారత స్వాతంత్య్రోద్యమం 1857లోనే ప్రారంభమైంది. మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తరవాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్య తోపె, బహదూర్ షా జఫర్, నానా సాహెబ్ పోరాటాలు చేశారు.

జమ్మూకశ్మీర్ అలా విలీనమైంది…

భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్థాన్‌లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. 1947 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌.. భారత్‌లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్, పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది.

దేశీ ఉత్పత్తులకు మద్దతుగా.. ది బోంబే స్టోర్‌

విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీ ఉత్పత్తులకు మద్దతుగా 1900 ప్రారంభంలో బాల్ గంగాధర్ తిలక్‌తో కలసి సర్ రతన్ జంషెడ్ టాటా.. బొంబే స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్‌ను స్థాపించారు. ప్రస్తుతం అది బోంబే స్టోర్‌గా సుప్రసిద్ధం.

అదయితే సులభంగా ఉంటుందని…

జాతీయ గీతంగా వందేమాతరానికి బదులు జన గణ మణను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్‌లో వాయించడానికి వందేమాతరం కన్నా జన గణ మణ అయితే సులభంగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ భావించారట.

సరైన అవగాహన లేకుండానే సరిహద్దు గీత…

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ ర్యాడ్‌క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు. భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండానే ర్యాడ్‌క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. తన నిర్ణయంపై చనిపోయేంత వరకు ర్యాడ్‌క్లిఫ్ బాధపడుతుండేవారని చెబుతుంటారు.

ఇండస్ నది నుంచి వచ్చిన పేరు…

‘ఇండియా’ అనే పేరును ఇండస్ (సింధూ) నది నుంచి తీసుకున్నారు. అత్యంత ప్రాచీనమైన సింధూ నాగకరితకు నిదర్శనంగా ఈ పేరును పెట్టారు.

To Top

Send this to a friend