3 గంటలకు వార్ మొదలు కాబోతోంది..

 

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వార్ మొదలు కాబోతోంది.. అది సరిహద్దుల్లో కాదు.. మైదానంలో భారత్ -పాకిస్తాన్ క్రికెట్ వార్.. ఇంగ్లండ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ , పాకిస్తాన్ లు ఫైనల్ చేరడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలో ఓటమి ఎరుగని చరిత్ర భారత్ ది.. పాకిస్తాన్ ఇన్ని ఏళ్లుగా ఒక్కసారి కూడా ప్రపంచకప్ మ్యాచ్ లలో భారత్ పై నెగ్గలేదు. ఆ రికార్డును ఈసారి ఫైనల్ లో చేధించాలని పాకిస్తాన్ సమరోత్సాహంతో ఉంది. భారత బ్యాటింగ్ కు, పాక్ బౌలింగ్ కు మధ్య సాగే పోరుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠ ఊపేసే ఈ మ్యాచ్ కు మీరు రెడీ అయిపోండి..

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది.. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిచిన భారత్ ఆ తర్వాత సెమీస్ చేరింది. సెమీస్ లో బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. విజయాలతో దూసుకొచ్చిన భారత్ ఓ వైపు.. ఓటమితో మొదలు పెట్టి అగ్రశ్రేణి జట్లకు షాక్ ఇచ్చిన జట్టు పాకిస్తాన్. ఇలా రెండు జట్ల భీకర పోరు నేడు జరగబోతోంది..

పాకిస్తాన్ అంచనాలకు అందని జట్టు.. మొదట భారత్ పై ఓడిపోయిన పాకిస్తాన్ పని అయిపోయిందనుకున్నారు. కానీ తన దైన రోజు ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించే సత్తా ఉన్న పాకిస్తాన్ అనుకున్నది సాధించింది. టోర్నీలోనే ఫుల్ ఫాంలో ఉన్న ఇంగ్లండ్.. తన సొంత దేశంలో ఓడించింది. అప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లను ఓడించి ఊపు మీదుంది. అంతటి బలమైన ఇంగ్లండ్ ను సెమీస్ లో ఓడించి పాకిస్తాన్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. దీంతో ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ లు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. దీనిపై బెట్టింగ్ లు జోరందుకోవడం విశేషం.

To Top

Send this to a friend