ఇలా చేస్తే  చీప్ గా దొరుకుతాయి..


ఒకటే మాత్ర.. ఒకటే ఫార్ములా.. కానీ ఒకదానికి పది రూపాయలు ధర ఉంటే.. మరో దానికి 100 రూపాయలకు పైగా ఉంటుంది. ఎందుకంటే అది దేశంలోనే ప్రతిష్టాత్మక బ్రాండెడ్ కంపెనీ తయారు చేసిందంటారు.. బ్రాండ్ ఉన్నంత మాత్రానా అదే మాత్రకు అంతా రేటా.? అని ప్రశ్నిస్తే మాత్రం దానికి సమాధానం దొరకదు.. అందుకే ఈ మందుల ధరల మాయాను చేధించేందుకు ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. దేశంలో జనరిక్ మందులపై చట్టం తెచ్చేందుకు రెడీ అయ్యారు.

· కార్పొరేట్ దందాకు చెక్
ఒక బ్రాండ్‌ ఔషధానికి బాగా పేరొస్తే దాని తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే అంశంతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం ధర నిర్ణయించి వినియోగదార్లను కొల్లగొట్టే అవకాశం తయారీదార్లకు ఉంటోంది. తమ బ్రాండెడ్‌ ఔషధాల అమ్మకాలను పెంచుకునేందుకు వైద్యులను ప్రలోభపెట్టేందుకు కూడా వెనుకాడని పరిస్థితి ఉంది. ఈ వ్యవహారాలన్నిటినీ అరికట్టి ప్రజలకు తక్కువ ధరలో ఔషధాలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జనరిక్‌ ఔషధాల చట్టాన్ని’ తీసుకువచ్చే యత్నాల్లో నిమగ్నమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ స్పష్టం చేయటం గమనార్హం. ఇటువంటి చట్టం వస్తే వైద్యులు ఇకపై మందులను వాటి అసలు పేరుతోనే(జనరిక్‌ నేమ్‌) రాయాల్సి ఉంటుంది. బ్రాండెడ్‌ ఔషధాలను సిఫార్సు చేయటానికి వీల్లేదు.

• ఎందుకింత వ్యత్యాసం !

బ్రాండెడ్‌ ఔషధాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి సంస్థలు భారీగా ఖర్చు చేస్తాయి. వైద్యులు తమ బ్రాండ్‌ ఔషధాన్నే సిఫార్సు చేసేలా పెద్దఎత్తున బహుమానాలు ఇవ్వాల్సి వస్తుంది. పంపిణీదార్లకు రాయితీలు ఇవ్వాలి. తయారీ ఖర్చుకు ఇదంతా అదనం. అంతేగాక బ్రాండెడ్‌ ఔషధాలపై అధిక లాభాలను ఆశిస్తాయి. అందువల్లే వాటి ధర ఎక్కువ. జనరిక్‌ ఔషధం విషయంలో ఇదంతా ఏమీ ఉండదు. పారాసెట్మాల్‌ ఔషధాన్ని ఎవరు తయారుచేసినా దాన్ని పారాసెట్మాల్‌ పేరుతోనే విక్రయించాలి. దీంతో ప్రచారం చేయాల్సిన అవసరం కానీ, అందుకు ఖర్చు కానీ ఉండవు. అందుకే జనరిక్‌ ఔషధాల ధరలు తక్కువ.

• ప్రపంచ వ్యాప్తంగా…

వైద్య వ్యయాలను తగ్గించుకోవటమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జనరిక్‌ ఔషధాల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అతిపెద్ద ఔషధ మార్కెట్లయిన అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాల్లో జనరిక్‌ మందుల వినియోగానికి అనువైన విధానాలు తీసుకువస్తున్నాయి. వాస్తవానికి బ్రాండెడ్‌ ఔషధాలు, జనరిక్‌ ఔషధాలు- అనే స్పష్టమైన తేడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉంది. ఒక కొత్త ఔషధాన్ని కనుగొన్న సంస్థకు దానిపై 15 నుంచి పాతికేళ్ల కాలానికి పేటెంట్‌ లభిస్తుంది. అప్పటి వరకూ దానికి ఒక బ్రాండ్‌ పేరు పెట్టి విక్రయించే అవకాశం ఆ సంస్థకే ఉంటుంది. పేటెంట్‌ గడువు తీరిపోయాక ఇతరులు అదే ఔషధాన్ని తయారు చేసి విక్రయిస్తే దాన్ని జనరిక్‌ మందుగా వ్యవహరిస్తారు. మనదేశంలో ఏ సంస్థ ఏ ఔషధాన్నైనా తయారు చేసి దానికో బ్రాండ్‌ పేరుపెట్టి విక్రయించవచ్చు. అందుకే జనరిక్‌ ఔషధాల కంటే బ్రాండెడ్ ‌ఔషధాలే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి.

To Top

Send this to a friend