500 కోట్లుంటే మీరే సీఎం..

ఆలూ లేదు.. చూలు లేదు.. వచ్చేసారి కాంగ్రెస్ దే అధికారమట. ఈ మధ్య ఢిల్లీ పెద్దలు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే నాయకుడి కోసం శూలశోధన మొదలుపెట్టారట.. కనీసం ఎంతలేదన్నా 500 కోట్లు ఖర్చు పెట్టే కాంగ్రెస్ నాయకుడు తమకు కావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హింట్ ఇచ్చారట.. ప్రస్తుతం తెలంగాణలో బలంగా ఉన్న కేసీఆర్ పార్టీని ఓడించాలంటే ఆ మాత్రం అమౌంట్ ఖర్చు పెట్టే మగాడు కావాలని.. గెలిస్తే వారిదే సీఎం పీఠం అని స్పష్టం చేశారట..

ఈ ప్రకటన వచ్చిందే ఆలస్యం.. తమ బలాబలాలు నిరూపించేందుకు టీ కాంగ్రెస్ నేతలు రెడీ అయిపోయారట.. హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ 500 కోట్లు ఖర్చుపెట్టడానికి సై అంటున్నాడట.. కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే 600 కోట్లకు పైగా ఖర్చు పెడతామని తమకే సీఎం పీఠం కావాలని అధిష్టానం ముందు డబ్బు ప్రదర్శన చేసినట్టు సమాచారం. పనిలోపనిగా గద్వాల అరుణక్క తాను ఓ 200 కోట్లు ఖర్చు పెడతానని తనకూ అవకాశం ఇవ్వాలని అధిష్టానికి కబురు పంపింది.. ఈ రేసులో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడట. ఉత్తమ్ కూడా 3 నుంచి 4 వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అని చెప్పాడట..

ఇక మన పెద్దలు జానారెడ్డి మాత్రం తాను 40 ఇయర్స్ కాంగ్రెస్ ఇండస్ట్రీ అని వాళ్లందరూ డబ్బు పెట్టి కాంగ్రెస్ ను గెలిపిస్తే సీనియర్, పార్టీకి సేవలు చేసిన దృష్ట్యా తనకే సీఎం సీటు ఇవ్వాలని వాళ్లందరినీ తాను మేనేజ్ చేస్తానని కాంగ్రెస్ పెద్దలకు పెద్ద మనిషిగా సెలవిచ్చాడట..

కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. నేల విడిచి సాము చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని మండిపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు. ఆ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగితే తప్ప టీఆర్ఎస్ ను ఓడించే పార్టీ ప్రస్తుతానికి తెలంగాణ పుట్టలేదు. ఇలా డబ్బులు ఖర్చు పెట్టే ఎన్ని వ్యూహాలు పన్నినా టీఆర్ఎస్ ముందు దిగదుడుపే..ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 500 కోట్లకంటే చాలా ఎక్కువే ఖర్చు పెట్టగలదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఎన్ని వందల కోట్లు అయినా పెట్టేయగలదు.. ఈ రెండు పార్టీలని తోసిరాజని కాంగ్రెస్ కు అధికారం వస్తుందనుకుంటే పొరపాటే..

కేసీఆర్, టీఆర్ఎస్ పై ఉన్న కాసింత అసంతృప్తి, ప్రజావ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే మొనగాడు ఇప్పుడు కాంగ్రెస్ కు కావాలి. ప్రజలకు చేరువై పోరాడే నాయకుడు ఉంటే చాలని.. ఇలా 500 పెట్టగానే గెలవరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే కాంగ్రెస్ నాయకులకు ఆ 500 కోట్లు కూడా పోయి రోడ్డున పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

To Top

Send this to a friend