కంప్యూటర్ వైరస్ అంటే జీవుల్లో రోగాలు కలిగించే వైరస్ కాదు. కంప్యూటర్లు, సెల్ఫోన్లు ఒక విధమైన యాంత్రిక సంకేతాలతో (machine language) నిర్దేశితమయ్యే విద్యుత్ ప్రేరణల ద్వారా పని చేస్తాయి. దీన్నే ప్రోగామ్ అంటారు. కంప్యూటర్ పరిభాషలో పట్టుకోడానికి, చూడడానికి వీలయ్యే భాగాలను హార్డ్వేర్ అంటారని, అలా వీలుకాని ప్రోగాములను సాఫ్ట్వేర్ అంటారని తెలిసే ఉంటుంది.
సాఫ్ట్వేర్ అనే ఈ ప్రోగామే సెల్ఫోన్లకు, కంప్యూటర్లకు జీవం లాంటిది. కొంతమంది జులాయిలు ఇంటర్నెట్ ద్వారా మోసపూరిత ప్రవృత్తితో అవాంఛనీయమైన సాఫ్ట్వేర్లను సృష్టిస్తారు. ఇవి ఒక పరికరంలోంచి మరో పరికరంలోకి వ్యాప్తి చెందుతూ విస్తరిస్తాయి. ఇది చేరిన పరికరాలు ఆశించిన విధంగా కాకుండా అసంబద్ధంగా, అనర్థంగా పని చేస్తాయి.
రోగాలను వ్యాప్తి చేసే వైరస్లు ఎలాగైతే ఒకరి నుంచి మరొకరికి సోకుతాయో అలాగే ఈ కంప్యూటర్ వైరస్లు కూడా వ్యాపిస్తాయి కాబట్టి ఆ పేరుతో వ్యవహరిస్తారు.
