సినీ వినీలాకాశంలో మరో నటుడు నేలవాలిపోయాడు. అతివేగం.. నిర్లక్ష్యంగా కారు నడపడంతో ఒకరి ప్రాణం పోయింది. రవితేజ తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. భరత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశాడు. భరత్ మరణంతో రవితేజ దిగ్భాంత్రికి గురైనట్లు సమాచారం.
ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి నెత్తురు పారింది. నటుడు భరత్ (49) దుర్మరణం చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
రవితేజ తమ్ముడు ఈ ఉదయమే మరణించిన విషయం వెలుగులోకి రాలేదు. ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగినా భరత్ స్నేహితులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ప్రమాదవార్త తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చనిపోయింది భరత్ అని నిర్ధారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. భరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
