రానున్న 48గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండగా మారుతోంది. ఒడిసా నుంచి దక్షిణ తమిళనాడు వరకు.. కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి.

అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురిసిన వర్షాలకు వరద నీరు నాగవళిలోకి భారీగా చేరుతోంది. తోటపల్లి ప్రాజెక్టు దగ్గర అధికారులు దిగువకు నీటిని వదిలిపెట్టారు. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా జూలై నెలలో ఇప్పటి వరకు ఒక మోస్తరుగానే వర్షాలు కురవడంతో అంతంతమాత్రంగా సాగుతున్న వ్యవసాయానికి తాజాగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మేలు చేకూరుస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

To Top

Send this to a friend