రివ్యూలపై ఆగ్రహం వద్దు బాసూ…


‘డీజే’ థ్యాంక్స్‌ మీట్‌ తాజాగా జరిగింది. ఆ కార్యక్రమంలో హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ రివ్యూలు రాసేవారు కాస్త ఆలోచించి రాయాలని, సినిమా బాగున్నా కూడా రివ్యూలు బ్యాడ్‌గా ఉంటే సినిమా కిల్‌ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. సినిమా బాగుంటే బ్యాడ్‌ రివ్యూలు రాసేందుకు సినీ విశ్లేషకులకు ఏమైనా సరదానా. ఒకటి రెండు అంటే సినిమాపై లేదా ఆ హీరోపై కోపంతోనో లేదా నిర్మాత అంటే కోపంతోనో రివ్యూలు రాస్తారు. కాని తెలుగు సినిమాల రివ్యూలు దాదాపు వందకు పైగా వెబ్‌ సైట్లలో వస్తాయి. వారంతా కూడా దాదాపు ఒకే అభిప్రాయంను వ్యక్తం చేస్తారు. అంటే సినిమా ఫలితం ఎలా ఉంటే రివ్యూలు అలాగే వస్తాయి.

రివ్యూల వల్ల సినిమా ఫ్లాప్‌ అవుతున్నాయని భావించడం హరీష్‌ శంకర్‌ అవివేకంగా భావించవచ్చు. సినిమా బాగుంటే రివ్యూలు బాగా ఉంటాయి. పాజిటివ్‌గా రాస్తారు. అలాంటప్పుడు రివ్యూల వల్లే సినిమా నడిచిందని చెప్తారా. సినిమా వారికి ఫ్లాప్‌ అయిన వెంటనే రివ్యూవర్స్‌పై పడటం కామన్‌ అయ్యింది. గతంలో కూడా పలు సందర్బాల్లో సిని వర్గాల వారు రివ్యూవర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని ఒక్క విషయం గుర్తించాలి, అదేంటంటే సినిమాపై ఏదో కోపం పెట్టుకుని రివ్యూలు రాయడం ఉండదు. సినిమా ఎలా ఉంటే అలాగే రివ్యూను రాస్తారు. కనుక సినిమా మంచిగా తీసేందుకు ప్రయత్నించాలి కాని రివ్యూవర్స్‌పై విమర్శలు చేయడం మానాలి.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అప్పుడు వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రంకు మంచి రివ్యూలు వచ్చాయి. ఆ సినిమా బాగుంది కనుక పాజిటివ్‌గా రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘రామయ్యావస్తావయ్యా’ చిత్రం చెత్త అంటూ రివ్యూలు వచ్చాయి. ఆ సినిమా అలాగే ఉందని దర్శకుడు కూడా ఒప్పుకున్నాడు. ఇక సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ చిత్రానికి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. సినిమా ఎలా ఉంటే అలా వస్తాయి బాసూ హరీష్‌. అందుకే నెక్స్ట్ అయినా లోపాలు లేకుండా తీసేందుకు ప్రయత్నించు.

To Top

Send this to a friend