రేప్ కేసులో బాబా.. అయినా జనం మద్దతు.. ఎందుకంటే..?

ఒక బాబా కోసం లక్షల మంది జనం రోడ్ల మీదకు రావడం దేశం మొత్తాన్నే ఆశ్చర్యపరుస్తోంది. తిండి తిప్పలు మానేసి అతని కోసం ఎదురుచూపులు.. అవసరమైతే ప్రభుత్వాన్ని ప్రతిఘటించడానికి మారణాయుధాలతో కాపలాలు.. ఇదంతా ఏ బాబా విషయంలోను మునుపెన్నడూ చూడని ప్రతిస్పందన.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను చూసి దేశమే నివ్వెరపోతున్న పరిస్థితి. రేప్ కేసులో అతనో దోషి అని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. జనం మాత్రం ఆయనంతలా ఎందుకు అభిమానిస్తున్నారు?.. ఇదే ఇప్పుడు చాలామందిలోను మెదులుతోన్న ప్రశ్న. దీనికి కారణం తెలుసుకోవాలంటే కాస్త లోతుగా చర్చించాల్సిందే.

పంజాబ్-హర్యాణా లాంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అక్కడ అగ్రకులాలు ఇప్పటికీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. హర్యానాలో కాప్ పంచాయితీల ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. వారు చెప్పిందే వేదంలా పాటిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డ డేరాలు వెనుకబడిన వర్గాల వారిని అక్కున చేర్చుకున్నాయి. వారి సంక్షేమానికి భరోసానిచ్చాయి. ఆహారం, వైద్యం విషయంలో వారికి తోడ్పాటును అందించాయి. మధ్య యుగాల కాలంలో ఉత్తరభారతంలో ఈ డేరాలు ఏర్పాడ్డాయి.

-* మధ్య యుగాల నుంచి డేరాలు:
పంజాబ్-హర్యాణా లాంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అక్కడ అగ్రకులాలు ఇప్పటికీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. హర్యానాలో కాప్ పంచాయితీల ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. వారు చెప్పిందే వేదంలా పాటిస్తుంటారు.
డేరా సచ్చాసౌదాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు తొలిసారిగా నెలకొల్పాడు. ఆయన బోధనలకు ఆకర్షితులైన లక్షలాది మంది ప్రజలు డేరాల్లో చేరారు. ఇక్కడ ఎలాంటి కుల వివక్ష వెంటాడకపోవడం వారికి సంతోషాన్నిచ్చింది. దీంతో డేరాల్లో చేరేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది.
ప్రార్థనల కోసం ఇక్కడ ఏర్పాటు చేసే నామ్ చర్చా ఘర్ లలో పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరిని సమానంగానే చూస్తారు. పంజాబ్, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, సహజంగానే దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఇందులో అధిక సంఖ్యలో చేరారు.
డేరా సచ్చాసౌదాను కొన్ని యూనిట్లుగా విభజించారు. డేరా సచ్చాసౌదాలో భంగీదాస్‌ గా పరగణించబడే వ్యక్తి ఈ యూనిట్లను పర్యవేక్షిస్తుంటాడు. ఒక్కో యూనిట్ కు ఒక్కో భంగీదాస్ ఉంటారు. డేరా సభ్యుల కష్ట, నష్టాలను పైస్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియజేయడం ఇతని విధి. అలా అతని నుంచి వచ్చే వైద్య, ఇతరత్ర ఫిర్యాదులపై ట్రస్ట్ యాజమాన్యం స్పందిస్తుంటుంది. సిర్సాలోని వీరి ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్యం, ఉచిత ఆహారం అందిస్తుంటారు.”

-* సంక్షేమానికి భరోసా:
డేరాల్లో చేరే సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారాన్ని ట్రస్ట్ అందిస్తుంటుంది. ఈ ఆహారం ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రేషన్ కన్నా నాణ్యతతో కూడి ఉంటాయి. అన్నింటికిమంచి ఇక్కడ ఎలాంటి అవినీతికి తావు ఉండదు. ఈ కారణంతోనే డేరాల్లో చేరడానికి ఎక్కువమంది మొగ్గుచూపుతుంటారు.
పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంత వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేస్తుంటారు. ఇవన్ని బలహీన వర్గాలకు అండగా ఉండటంతో డేరా స్వచ్చా సౌదాలో లక్షలాది జనం సభ్యులుగా చేరారు.

-* అందుకే అంత ఫాలోయింగ్
తమ సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న డేరా ట్రస్టు పట్ల అక్కడి ప్రజలు విశ్వాసంతో ఉంటారు. అందుచేతే గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ వ్యవహారంలో వారు ఎంతకైనా తెగించడానికి వెనుకాడటం లేదు. దేశ చట్టాల కన్నా బాబాకే తాము విధేయులుగా ఉంటామన్న సంకేతాలు పంపిస్తున్నారు.
వీరి తాకిడి తట్టుకోలేకనే అవసరమైతే మరిన్ని బలగాలను మోహరించాలని హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు తీర్పు సమయంలో.. మారణాయుధాలు, పెట్రోలు, డీజిల్ వంటి వాటితో గుర్మీత్ భక్తులంతా అక్కడ హల్ చల్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గుర్మీత్ ను కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో పరిస్థితులు ఇంకెక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

-* డేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులు
అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పేరు 19 గిన్నిస్‌బుక్ రికార్డులున్నాయి. 2003 నుండి 2015 మధ్య కాలంలో ఈ 19 గిన్నిస్‌బుక్ రికార్డులు నమోదయ్యాయి. 2003, డిసెంబ‌ర్ 3న గుర్మీత్ మొద‌టి గిన్నిస్ రికార్డు న‌మోదు చేశారు.15,432 మంది ర‌క్త‌దాత‌ల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి రక్తదానం చేయడంతో ఆయన ఈ రికార్డును నమోదు చేశారు.
2004లో మ‌ళ్లీ ర‌క్త‌దానంలో 17,921 దాత‌లతో పాత రికార్డును బ్రేక్ చేశారు. త‌ర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్య‌క్ర‌మంతో ద్వారా రెండు రికార్డులను నమోదు చేశారు.
2010లో ర‌క్త‌దానంలో 43,732 దాత‌ల‌తో మ‌రో రికార్డును సృష్టించాడు. దీనితో పాటుగా 4,603 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించే క్యాంపును ఏర్పాటుచేసి రికార్డు క్రియేట్ చేశారు రామ్‌రహీమ్‌సింగ్.

వీటితో పాటు మొక్క‌లు నాట‌డం, నాణేలు గాల్లోకి ఎగుర‌వేయడం, డాప్ల‌ర్ అల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌ల క్యాంప్ నిర్వ‌హ‌ణ‌, బీపీ న‌మోదు క్యాంపు నిర్వ‌హ‌ణ‌, షుగ‌ర్ వ్యాధి చెక‌ప్ క్యాంపు నిర్వ‌హ‌ణ‌తో డేరా బాబా గిన్నిస్ బుక్‌లో స్థానం పొందారు.
కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌ల క్యాంపు నిర్వ‌హ‌ణ‌, చేతి ప‌రిశుభ్ర‌త క్యాంపు నిర్వ‌హ‌ణ‌, ఫింగ‌ర్ పెయింటింగ్ పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద మాన‌వహారం నిర్వ‌హ‌ణ‌, కూరగాయ‌ల‌తో బొమ్మ‌ల పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్ట‌ర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉన్నాయి.
కానీ, అనుహ్యంగా ఆయనపై అత్యాచార కేసు నమోదు కావడం, ఆ కేసులో సిబిఐ కోర్టు దోషిగా శుక్రవారం నాడు తేల్చింది.

To Top

Send this to a friend