దేశ ప్రజలతో మోడీ ‘పన్ను’లాట..

ప్రజల సొమ్మును ప్రజలకు ఖర్చు పెట్టేవాడే గొప్ప రాజు, గొప్ప ప్రధాని.. కానీ ప్రజల నుంచి అత్యధిక మొత్తం డబ్బులు , పన్నులు వసూలు చేసే వారిని ఏం అంటారు.. మోడీ జీ ఇందులో అగ్రగణ్యుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మోడీజీ పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలు ఒక్కటీ ప్రకటించలేదు. కానీ ప్రజల నుంచి మాత్రం ముక్కు పిండీ వసూలు చేసేందుకు జీఎస్టీ తెస్తున్నారు. ఇప్పుడిది దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.

ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ దేశం కూడా వస్తువులు, వస్తుసేవలపై బీజేపీ ప్రభుత్వం వేస్తున్నంత పన్ను వేయడం లేదు. చైనా, కెనెడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదిరత దేశాలన్ని కేవలం 15 నుంచి 18శాతం మాత్రమే పన్ను వేశాయి. కానీ మన బీజేపీ ప్రభుత్వం 28శాతం పన్ను విధించింది. ఇప్పటికే అందరికీ మెసేజ్ లు కూడా పంపిస్తోంది. మొబైల్ సేవలు, రీచార్జ్ లపై కూడా ఇక నుంచి 18శాతం ట్యాక్స్ వసూలు చేస్తామని మొబైల్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు ఈరోజే మెసేజ్ లు పంపాయి. బ్యాంకులు సర్వీస్ చార్జ్ పేరిట 18శాతం పన్ను వసూలు చేస్తాయని పేర్కొన్నాయి. ఇలా అన్నింటిపై మోడీ ప్రభుత్వం ఎడా పెడా జీఎస్టీ బాదేందుకు సిద్ధం కావడంతో ధరలు పెరిగి సామాన్యుడు అల్లాడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది..

నోట్ల రద్దు వల్ల దేశంలోని 120 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారంటే అతిశయోక్తి కాదు. అంతటి పెద్ద తప్పును చేసిన బీజేపీ ఇప్పుడు మరోసారి దేశప్రజానీకానికి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. జూలై1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్)ను ప్రవేశపెడుతోంది. ఇది దేశ ప్రజలపై ఎంత భారం మోపుతుందో.. ధరలు ఎంత మండిపోతాయో.. ఎన్ని కష్టాలు వస్తాయో అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఒక్కటి మాత్రం నిజం.. జీఎస్టీ వల్ల సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగం లేదు. కార్పొరేట్లకు మేలు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.. ప్రభుత్వానికి మాత్రం గల్లాపెట్ట నిండడానికి ఉపయోగపడుతోంది.

To Top

Send this to a friend