సాహిత్య మేరునఘం నేలకొరిగింది..


సాహిత్య మేరునఘం నేలకొరిగింది.. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.. కరీంనగర్ సాహిత్య కలం సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు.

కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన హన్మాజీపేటలో 1931 జూలై 29న మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు సినారె జన్మించారు. వీధిబడి లో సినారె హరికథలు, జానపదాలు, జంగం కథలను నేర్చుకొని ప్రదర్శించేవారు. సిరిసిల్ల లో ప్రాథమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. అనంతరం పై చదువుల కోసం హైదరాబాద్ లో ఇంటర్మీడియెట్ చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదివారు. తెలుగు సాహిత్యంలో పీజీ చేశారు.

సినారె తెలుగు సినిమాల్లోకి వచ్చి రచయితగా ఎన్నో అద్భుత పాటలు రాశారు. సినారె రాసిన పాటలు జనాలను ఉర్రూతలూగించాయి. నాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులకు , నేటి రోజుల్లో కొన్ని చారిత్రక సినిమాలకు సినారె పాటలు రాశారు. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ పాట సినారెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవలే అరుంధతి సినిమాలో ‘జేజమ్మా.. జేజమ్మా’ పాటను సినారెనే రాశారు. సినారె ప్రతిభకు మెచ్చి చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం 1997లో రాజ్యసభ సభ్యుడిగా నామినెట్ చేసింది. తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసిన సినారె మరణంపై తెలుగు సినిమా పరిశ్రమ, ఏపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

To Top

Send this to a friend