ఊరట.. హెచ్చరిక..


ప్రతీ ఏడు ఏదో సాకు చెప్పి లేటుగా వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి మాత్రం అనుకున్న టైంకు ఠంచనుగా వచ్చి విరివిగా వానలు కురిపిస్తూ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు తీపి కబురునందించాయి. మే 30నాడే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు, ఆరేబియా, బంగాళాఖాతంలో అననుకూల పరిస్థితుల వల్ల ఇన్నాళ్లు విస్తరించలేదు. జూన్ 7 నాటి రాయలసీమ దక్షిణ కోస్తాకు వచ్చి నేడు తెలంగాణ మొత్తం ఒకేరోజులో వ్యాపించాయి.

ఇప్పటికీ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. మంగళవారం తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా నైరుతి ఆగమనంతో భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఐదు రోజుల పాటు తీవ్ర వానలు పడుతాయని చెప్పారు.

ఇక నైరుతి ఆగమనంతో రైతులు దుక్కులు దున్నకొని రెడీ గా ఉన్నారు. ఈ రెండు రోజుల్లోనే విత్తనాలు నాటేందుకు సమాయత్తమవుతున్నారు. అనుకున్న టైంకి వర్షాలు పలకరించడంతో రైతులు, ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.

కాగా వానలు హైదరాబాద్ వాసులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఒక్క వాన పడితేనే కాలనీలు, హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాలు జగదిగ్భంధంలో చిక్కుకుంటున్నాయి. దీని వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. కాగా వర్షా కాలం ప్రవేశించడంతో వాతావరణ మార్పు వల్ల పిల్లలు, వృద్ధులు, ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

To Top

Send this to a friend