చిత్రం : ఫ్యాషన్ డిజైనర్
రేటింగ్ : 2.0/5.0
బ్యానర్ : మధుర ఎంటర్ టైన్మెంట్స్
సంగీతం : మణిశర్మ
దర్శకుడు : వంశీ
నిర్మాత : మధుర శ్రీధర్
విడుదల : జూన్ 2, 2017
స్టారింగ్ : సుమంత్ అశ్విన్, అనీష ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష
వంశీ కెరీర్‌తో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికి నిలిచి పోయే చిత్రం ‘లేడీస్ టైలర్’. ఆ సినిమాకు దర్శకత్వం వంశీ దర్శకత్వంలోనే ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అనగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే వంశీ గత కొంత కాలంగా పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేక పోయాడు. మరి ఈ సినిమా అయినా విజయాన్ని వంశీకి ఇచ్చిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథలోకి వెళితే : లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాళం. ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి వృత్తినే గోపాళం కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఎప్పటికైనా ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలనేది గోపాళం కోరిక. ఆ కోరికను తీర్చుకునేందుకు గోపాళం ఏం చేశాడు, అందుకు ముగ్గురు అమ్మాయిలను ఎలా వాడుకున్నాడు అనేది సినిమా కథ.
నటీనటుల ఫర్ఫార్మెన్స్ : లేడీస్ టైలర్ అనగానే రాజేంద్ర ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు గుర్తు వస్తాడు. అయితే ఆ స్థాయిలో కాకున్నా సుమంత అశ్విన్ ఆకట్టుకుంటాడని ఆశించాం. కాని సుమంత్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు. గోదావరి యాసలో డైలాగ్స్ చెప్పడం మినహా మరే విధంగా ఆకట్టుకోలేక పోయాడు. ఇక హీరోయిన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. గ్లామర్‌తో కాస్త పర్వాలేదు అనిపించారు. వారికి నటన పరంగా అవకాశం రాలేదు. మిగిలిన పాత్రల్లో నటించినవారు కూడా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు.
సాంకేతికపరంగా: మణిశర్మ సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఇప్పటికే మణిశర్మ పాటలు ఔట్‌డేటెడ్ అయ్యాయి. మళ్లీ ఆయనతో ఎందుకు సంగీతం చేయించారో వారికే తెలియాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సో సో గానే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరు అందాలు, గోదావరి అందాలు చక్కగా సినిమాలో చూపించారు. ఎడిటింగ్‌లో లోపాలున్నాయి. దర్శకుడు వంశీ కథను మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.
విశ్లేషణ: ప్రస్తుత ట్రెండ్‌కు దూరంగా వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అప్పట్లో సంచలన చిత్రాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వంశీ ఇప్పుడు ప్రేక్షకుల నాడి పట్టడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. వంశీ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ట్రెండ్‌కు దూరంగా ఉంది. ఇక వంశీ సినిమాలకు దూరంగా ఉండటం మంచిది అనే అభిప్రాయం ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మధుర శ్రీధర్ అందించిన స్టోరీ లైన్ కూడా ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా లేదు. మొత్తంగా లేడీస్ టైలర్ తనయుడు ఫ్యాషన్ డిజైనర్ ఆకట్టుకోలేక పోయాడు.
ప్లస్ పాయింట్స్ :
గోదావరి అందాలు,
కొన్ని కామెడీ సీన్స్.
నచ్చనివి :
కథ,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం,
సుమంత్ అశ్విన్,
హీరోయిన్స్.
చివరగా :
లేడీస్ టైలర్ పరువు తీసిన కొడుకు ఫ్యాషన్ డిజైనర్.
