ఆ మొసలి కన్నీరు వెనుక నిజమెంత.?

“ఇండియాయే ఇందిర.. ఇందిరే ఇండియా..” దేశమంతా విధేయుల భజన మార్మోగుతున్న రోజులు.. ఇందిరాగాంధీ తిరుగులేని ప్రధానమంత్రిగా ఆవిర్భవించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్దంలో విజయంతో ప్రజల్లో ఆమె ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. క్రమంగా ఇందిరలో గర్వం పెరిగింది. తానేమీ చేసినా చెల్లతుందనే అహంభావం వచ్చేసింది. తన వారసునిగా తనయుడు సంజయ్‌ గాంధీని ఎంపిక వంశపారం పర్యపాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.. సంజయ్‌ రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగారు. పరిపాలన గాడి తప్పి విచ్చల విడితనం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోవడం ప్రారంభమైంది. ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ గాంధేయవాది లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన సంపూర్ణ విప్లవ ఉద్యమం యావత్తు దేశాన్ని కదిలిస్తోంది..

సరిగ్గా అప్పుడే ఇందిరా గాంధీపై పిడుగు పడింది.. రాయబరేలీ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు ఫలితం ఇది. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అలజడి.. ఇందిర గద్దె దిగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. సుప్రీంకోర్టు షరతుల మీద బెయిల్ తీర్పుపై స్టే ఇచ్చినా, తనను చుట్టు ముట్టిన సమస్యల నుండి బయట పడటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టూ చేరిన వందిమాగదుల సలహాల ఫలితంగా ఇందిరలో దాగిన నియంత నిద్ర లేచింది. ఒక కీలక నిర్ణయానికి వచ్చేశారు. అర్ధరాత్రి వేళ రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ను కలుకొని కీలక పత్రాన్ని ఆయన ముందు పెట్టారు.. ఫకృద్దీన్ మారుమాట్లాడకుండా సంతకం చేశారు.. 352వ నిబంధన క్రింద అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చింది.. అర్ధరాత్రి వేళ భారత ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. చీకటి రోజులకు తెరలేచింది.

ఆ రోజు జూన్ 25, 1975..దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి, ఎక్కడిక్కడ జైళ్లకు తరలించారు.. జయప్రకాశ్‌ నారాయణ్‌, మురార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌ కృష్ణ అద్వానీ, చరణ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, అశోక్ మెహతా, జార్జ్ ఫెర్నాండెజ్‌, మధుదండావతే, రామకృష్ణ హెగ్డే, రాజ్‌నారాయణ్‌ తదితర నాయకులను కటకటాల పాలు చేశారు.. పత్రికలపై సెన్సార్ షిప్ విధించడంతో దేశ ప్రజలకు ఏమి జరుగుతోందో తెలియదు.. ఆరెస్సెస్‌తో పాటు ఎన్నో సంస్థలను రద్దు చేశారు. ప్రశ్నించే వారిని, మేధావులను, పాత్రికేయుల గొంతు నొక్కారు.. వారినీ మీసా చట్టం కింద జైళ్లకు పంపారు. దేశంలోని చెరసాలలన్నీ రాజకీయ ఖైదీలతో కిక్కిరిసి పోయాయి.

ఎమర్జెన్సీ ముసుగులో సంజయ్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే.. 28 ఏళ్ళకే దేశ దేశ ప్రజలు దాన్ని కోల్పోయారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి.. తన పదవిని కొనసాగించుకోవడానికి ఇందిరా గాంధీ లోక్ సభ కాల పరిమితిని ఆరేళ్లకు పెంచారు.. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్య ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు జాగృతం కావడం మొదలు పెట్టారు.. ఎక్కడిక్కడ తిరుగుబాటు వాతావరణం కనిపిస్తోంది.. దీంతో 19 నెలల చీకటి రోజుల తర్వాత ప్రధాని ఇందిరాగాంధీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ పరిస్థితి ఏనాటికైనా తనకు ముప్పు తెస్తుందని భయపడిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో 1977 మార్చి 21న ఎమర్జెన్సీ ఎత్తేసింది ఇందిరాగాంధీ.. అలా దేశానికి పట్టిన సుదీర్ఘ గ్రహణం తొలగి పోయింది..

ఎమర్జెన్సీ సమయంలోనే ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది.. జయప్రకాశ్ నారాయణ సూచన మేరకు భిన్న రాజకీయ పక్షాలు కలిసిపోయి జనతా పార్టీ ఆవిర్భవించింది.. అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇందిరా గాంధీకి బుద్ది చెప్పుతూ, జనతాకి ఘన విజయం చేకూర్చారు.. మురార్జీ దేశాయి ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది.. దురదృష్టవశాత్తు భిన్న సైద్దాంతిక నేపథ్యాలు ఉన్న నాయకుల కారణంగా ఈ ప్రభుత్వం ఎక్కవ కాలం నిలవలేదు.. ప్రతిపక్షాల అనైక్యత ఫలితంగా మళ్లీ ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.

* ఎమర్జెన్సీ మళ్లీ వస్తుందా?..
కొద్ది సంవత్సరాలుగా దేశంలోని మేధావులు, రాజనీతి కోవిధుల్లో నెలకొన్న ఆవేదన ఇది.. ఇందుకు కారణం మన రాజ్యాంగంలో, వ్యవస్థలో ఉన్న లోపాలే.. మన రాజ్యాంగాన్ని ఇప్పటికి వంద సార్లు సవరించుకున్నాం.. మరోవైపు కాంగ్రెస్ తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి.. వ్యక్తి కేంద్రంగా నడిచే రాజకీయాలు ఏనాటికైనా మన వ్యవస్థకు ప్రమాదకరమే.. 42 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ విషాద ఘటనకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పుకోకున్నా, ఈనాటికి విచారం వ్యక్తం చేయలేదు.మళ్లీ ఎమర్జెన్సీ రాకుండా చూసుకోవాల్సిన భాద్యత ప్రతిపౌరుడిపైన ఉంది .దీనికి ఓక్కటేమార్గం మంచివాళ్లు రాజకీయాలు చెడిపోయినాయి అనిదూరంగా ఉండకుండా రాజకీయాల్లోకి వచ్చి నీతివంతమైన రాజకీయాలకు పునాదులు వేయడమే మార్గం

To Top

Send this to a friend