నీళ్లు పట్టుకునే ఆడబిడ్డని కనికరం లేకుండా కొడవలితో నరుకుతారా..

ఎన్నికల యుద్ధంలో టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలన్నారు సీఎం చంద్రబాబు. మిషన్‌-2019పై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. కార్యకర్తల కష్టానికి, త్యాగానికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని 76శాతం వరకు ఉందన్నారు. అన్ని సర్వేలు టీడీపీ గెలుపునే నిర్ధారిస్తున్నాయని చెప్పారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ రశీదుల గురించి అందరికీ చెప్పాలని సూచించారు.

ఓటమి భయంతో మోదీ, జగన్‌లో ఫ్రస్టేషన్ పీక్ స్టేజ్‌కు వెళ్లిందన్నారు. నీళ్లు పట్టుకునే ఆడబిడ్డపై కనికరం లేకుండా కొడవలితో నరకుతారా అని మండిపడ్డారు. వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓట్లేస్తే జనాన్ని బతకనిస్తారా.. ఆస్తుల్ని ఉండనిస్తారా.. అని ప్రశ్నించారు.

ఆటో డ్రైవర్లపై వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. పసుపు జెండా కట్టిన ఆటోలపై దాడులకు తెగపడ్డారని ఫైరయ్యారు. చివరికి స్కూల్ పిల్లల ఆటోలపై కూడా దాడులు చేస్తున్నారన్నారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులు తొలగించామనే టీడీపీపై కక్షగట్టారన్నారు. టీడీపీకి అండగా ఉండే వర్గాలనే బీజేపీ, వైసీపీలు టార్గెట్ చేస్తున్నాయన్నారు.

ఆంధ్రాకు అన్నింటిలోనూ బీజేపీ అన్యాయమే చేసిందన్నారు చంద్రబాబు. అమిత్ షా పొట్టకోస్తే అన్నీ అబద్దాలేనన్నారు. నేరగాళ్లకు, దొంగలకు చారిత్రక అవసరం వైసీపీ గెలుపని ఎద్దేవా చేశారు. జగన్ కేసుల మాఫీలో మోదీ దృఢ చిత్తమా అని ప్రశ్నించారు.

To Top

Send this to a friend