‘డీజే’ విడుదలవ్వడం కష్టమా?

 

సమాజంలో ఇప్పటికే బ్రహ్మణులు అంటే ఒక చులకన భావం ఉందని, వేద పండితులు అయిన బ్రహ్మణులపై జోకులు వేసుకోవడం పరిపాటి అయ్యిందని, ఇక దానికి తోడు సినిమాల్లో కూడా బ్రహ్మణులను కించపర్చేలా చూపించడం వల్ల మా మనోభావాలు దెబ్బ తింటున్నాయంటూ బ్రహ్మణ సంఘాల నాయకులు తాజాగా హెచ్‌ఆర్సీ ముందుకు వెళ్లారు. త్వరలో విడుదల కాబోతున్న ‘డీజే’ చిత్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

అల్లు అర్జున్‌, హరీశ్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డీజే’ చిత్రం పాట విడుదలైనప్పటి నుండి కూడా వివాదం ఓ రేంజ్‌లో చెలరేగుతుంది. పాటలో బ్రహ్మణులను కించపర్చేలా పదాలు ఉన్నాయంటూ బ్రహ్మణ సంఘం నాయకులు మొదట సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు, ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ఫిర్యాదులు ఇచ్చారు. అయినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది.

దాంతో బ్రహ్మణ సంఘాల వారు ‘డీజే’ చిత్రం విడుదల నిలిపేయాలని, చిత్రంలో కొన్ని బ్రహ్మణులను కించపర్చే సీన్స్‌ ఉన్నాయంటూ హెచ్‌ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. బ్రహ్మణ సంఘం ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌ఆర్సీ వారు విచారణ ప్రారంభించారు. త్వరలోనే దర్శకుడు, నిర్మాతతో ఈ విషయమై చర్చిస్తామని ప్రకటించారు. దాంతో సినిమా విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చిత్రంలో బ్రహ్మణులను కించపర్చే సీన్స్‌ లేవు అని నిరూపించుకున్న తర్వాత సినిమాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈనెల 23న సినిమాను విడుదల కావాల్సి ఉంది.

To Top

Send this to a friend