‘డీజే’ ఆమెకు చివరి సినిమా?

‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్‌లో ఒక భారీ సినిమా ఆఫర్‌ రావడంతో తెలుగు సినిమాలను వదిలేసి అక్కడకు వెళ్లి పోయింది. ఆ సినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక పోవడంతో మళ్లీ ఈ అమ్మడు టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. తాజాగా అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించింది.

‘డీజే’ చిత్రంలో అల్లు అర్జున్‌తో ఈ అమ్మడు చేసిన రొమాన్స్‌ అదిరిపోనుందని టీజర్‌ చూస్తేనే అర్థం అవుతుంది. ఇటీవల విడుదలైన పాటలో అల్లు అర్జున్‌కు పోటీగా స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకుంది. ఇలాంటి ముద్దుగుమ్మతో సినిమాలు చేసేందుకు పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. స్టార్‌ హీరోలు సైతం ఈ అమ్మడితో సినిమాలకు ఆసక్తిని కనబర్చుతున్నారు. కాని ఈ అమ్మడు మాత్రం తెలుగులో ఇప్పటి వరకు మరో సినిమాకు కమిట్‌ కాలేదు.

పూజా హెగ్డేకు హిందీ నుండి ఒక ఆఫర్‌ వచ్చిందని, ఆ ఆఫర్‌ కారణంగానే తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్‌ వినిపిస్తుంది. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పూజా హెగ్డే మళ్లీ తెలుగులో నటించాలని కోరుకోవడం లేదని తెలుస్తోంది. ఇకపై బాలీవుడ్‌లోనే ఫిక్స్‌ అవ్వాలని ఈమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

To Top

Send this to a friend