‘బాహుబలి’ చిత్రంతో ఆకట్టుకున్న ప్రభాస్, అనుష్కలు మరోసారి ‘సాహో’ చిత్రంలో రొమాన్స్ చేయబోతున్నట్లుగా రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిర్మాతలు కొట్టి పారేశారు. ‘సాహో’ సినిమాలో అనుష్కను హీరోయిన్గా ఎంపిక చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ‘సాహో’ కోసం హీరోయిన్ ఎంపిక కార్యక్రమం జరుగుతుందని నిర్మాతలు చెప్పుకొచ్చారు.
ప్రభాస్‌కు అనుష్కకు మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని, ఆ కారణంగాను ‘సాహో’ సినిమాలో అనుష్కను హీరోయిన్గా ఎంపిక చేయాలంటూ ప్రభాస్ నిర్మాతలకు సూచించాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయమై కూడా నిర్మాతలు క్లారిటీ చేశారు. ప్రభాస్ ఎప్పుడు కూడా హీరోయిన్స్ విషయమై పట్టించుకోరు అని, ఆ విషయాన్ని నిర్మాతలకు పూర్తిగా వదిలేస్తాడని ఈ సందర్బంగా నిర్మాతలు చెప్పుకొచ్చారు. వచ్చే నెల నుండి ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. అప్పటి వరకు ఒక హీరోయిన్ను పైనల్ చేయాలనే పట్టుదలతో నిర్మాతలు, దర్శకుడు ఉన్నారు.
‘బాహుబలి’ చిత్రంతో బాలీవుడ్ స్థాయిలో ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ప్రభాస్ కోసం ఆ రేంజ్‌కు తగ్గ హీరోయిన్ను అంటే బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేస్తేనే ‘సాహో’ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే విషయాన్ని కోరుకుంటున్నారు. అతి త్వరలోనే సాహో హీరోయిన్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
