దాసరి చివరి కోరిక తీరలేదు.

దర్శక దిగ్గజం, దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన మరణ వార్త తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా సౌత్‌ సినీ పరిశ్రమ మొత్తం షాక్‌కు గురి చేసింది. ఎన్నో అద్బుత సినిమాలను తెరకెక్కించి, పలు సినిమాలను నిర్మించి, మరెన్నో సినిమాలకు రచన సహకారం అందించిన దాసరి నారాయణ రావు చివరి కోరిక తీరకుండానే మరణించారు. ఆయన చాలా సంవత్సరాలుగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమాను నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు.

పవన్‌ కళ్యాణ్‌తో తాను సినిమాను నిర్మించబోతున్నట్లుగా దాసరి రెండున్నర సంవత్సరాల క్రితం ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం కూడా కథను సిద్దం చేయిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దాసరి నిర్మాణంలో నటించాలని పవన్‌ కళ్యాణ్‌ కూడా కోరుకున్నారు. కాని ఆ సినిమా తెర రూపం దాల్చకుండానే దాసరి మృతి చెందడం సినీ వర్గాల వారిని కలిసి వేస్తున్న విషయం. ఎన్నో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు దాసరి తాను అనుకున్న ఒక సినిమాను తెరకెక్కించకుండానే మృతి చెందడం విచారకం.

పవన్‌ కళ్యాణ్‌ కోసం దాసరి మూడు నాలుగు కథలు రెడీ చేయించారు. ఆ కథల్లోంచి త్వరలో ఇద్దరం కలిసి ఒకటి ఎంపిక చేస్తామని దర్శకరత్న ఆ మద్య చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఆయన అనారోగ్యం పాలవ్వడం జరిగింది. నాలుగు నెలలుగా ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవల పుట్టిన రోజు సందర్బంగా కాస్త హుషారుగా కనిపించినా మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఒక గొప్ప వ్యక్తి చేయాలనుకున్న పని చేయకుండానే చనిపోవడం నిజంగా దురదృష్టం అని ఆయన అభిమానులు అంటున్నారు.

To Top

Send this to a friend