మరో సంచలన చిత్రం ‘ఆచార్య అరెస్ట్‌’

‘దండుపాళ్యం’ దర్శకుడు శ్రీనివాసరాజు 5 భాషల్లో రూపొందిస్తున్న మరో సంచలన చిత్రం ‘ఆచార్య అరెస్ట్‌(యాన్‌ ఇన్సల్ట్‌ టు ఎవ్రీ హిందు)
‘దండుపాళ్యం’ వంటి సంచలన చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయాల్ని అందుకున్న దర్శకుడు శ్రీనివాసరాజు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం2’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తర్వాత యదార్థ సంఘటనల ఆధారంగా మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు దర్శకుడు శ్రీనివాసరాజు. కంచిపీఠం స్వామీజీ శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్ట్‌ నేపథ్యంలో ‘ఆచార్య అరెస్ట్‌’ పేరుతో 5 భాషల్లో మరో భారీ చిత్రం రూపొందించబోతున్నారు.

జయేంద్ర సరస్వతి అరెస్ట్‌కి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం వుంటుంది. స్వామీజీ సన్నిహితులతోపాటు మరెంతో మందిని కలిసి సమగ్ర సమాచారాన్ని సేకరించారు శ్రీనివవాసరాజు. రెండు సంవత్సరాలుగా ఈ స్క్రిప్ట్‌ని తయారు చేస్తున్నారు. 2004లో తమిళనాడులోని కంచి మఠంలో జరిగిన ఓ భక్తుడి హత్యకు సంబంధించిన అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించనున్నారు. ఈ కేసును క్లోజ్‌ చేసినప్పటికీ ఈ సంఘటన జరగడానికి కారణాలు ఏమిటి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం వుందని భావించి ఈ యదార్థ సంఘటనను తెరకెక్కిస్తున్నారు శ్రీనివాసరాజు. ఈ సంఘటనలో రాజకీయ నాయకుల జోక్యం, హత్య ఎలా జరిగింది అనే మిస్టరీ, దీనికి సంబంధించి అప్పట్లో ప్రచారంలో వున్న రూమర్లను కూడా చిత్రించబోతున్నారు.

ఈ సందర్భంగా జయేంద్ర సరస్వతిని కూడా కలిసి అతని వెర్షన్‌ కూడా తీసుకోబోతున్నారు శ్రీనివాసరాజు. తెలుగు, కన్నడ, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో ‘ఆచార్య అరెస్ట్‌’ చిత్రం నిర్మాణం జరుపుకోనుంది. ‘దండుపాళ్యం’ చిత్రంలో ఒక నేరం చెయ్యడం వెనుక పరిస్థితుల గురించి చర్చించడం జరిగింది. ‘ఆచార్య అరెస్ట్‌’ చిత్రంలో యదార్థ సంఘటనలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నామని శ్రీనివాసరాజు తెలిపారు. ఈ చిత్రంలో పెద్ద హీరోలు, భారీ తారాగణం నటిస్తుందని తెలియజేశారు. ఈ భారీ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.

To Top

Send this to a friend