పట్టువీడ‌ని కలెక్ట‌ర్‌, అధికారులు…. ముదిరిన మ‌హ‌బూబాబాద్ వివాదం

కలెక్టర్‌ ప్రీతిమీనా-ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ వివాదం ముదిరింది. శంకర్‌ నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. శంకర్‌నాయక్‌పై తీసుకున్న చర్యల పట్ల ఐఏఎస్‌లు, ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే అరగంటలో పోలీస్‌స్టేషన్‌ నుంచి రాచ మర్యాదలతో బెయిల్‌ తీసుకుని వెళ్లడం ఐఏఎస్‌లను అసంతృప్తికి గురిచేసింది. దీంతో ఈ ఘటనపై న్యాయం జరగకపోతే ఐఏఎస్‌లు ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. కాలయాప‌న ద్వారా స‌మ‌స్య‌ను సాగదీయాల‌ని ఆయ‌న చూస్తున్నారు. క‌లెక్ట‌ర్ల‌కు మ‌ద్ద‌తు ప‌లికితే ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. అదే ఎమ్మెల్యేకు మ‌ద్ద‌తు ప‌లికితే అధికారులకు త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని ఆయ‌న భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఎమ్మెల్యే సారీ చెప్పినా….అరెస్టు చేసినా…అధికారులు పట్టువీడ‌క‌పోవ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కావాల‌నే స‌మ‌స్య‌ను పెద్ద‌ది చేస్తున్నారని ఆయ‌న అనుకుంటున్నార‌ట‌. అందుకోస‌మే ఈ సమ‌స్య‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదట‌. మ‌రోవైపు తన రాజకీయ భవిష్యత్‌ కోసం తన అనుచరగణంతో ఆదివారం హైదరాబాద్‌లో శంకర్‌నాయక్‌ సీఎం ఎదుట బలనిరూపణకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పెద్ద‌మ్మత‌ల్లికి పూజ పేరిట త‌న అనుచ‌రుల‌ను హైద‌రాబాద్‌కి ర‌ప్పిస్తున్నారు. అక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై…త‌న బ‌లాన్ని చూపాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. ఆ త‌ర్వాత భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్‌ను క‌ల‌వాల‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాదం మరికొన్ని రోజులు కొన‌సాగే అవ‌కాశం క‌న్పిస్తోంది.

To Top

Send this to a friend