మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’తో దాదాపు పది సంవత్సరాల తర్వాత కనీవినీ ఎరుగని స్థాయిలో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మెగా ఫ్యామిలీ ఊహించని స్థాయిలో ‘ఖైదీ నెం.150’కి కలెక్షన్స్ వచ్చాయి. ఆ సినిమా నిర్మాత అయిన రామ్ చరణ్‌కు ఏకంగా 100 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లుగా ట్రేడ్ పండితుల ద్వారా సమాచారం అందుతుంది. అంతటి సంచలన విజయం తర్వాత చిరంజీవి నటించే ఏ సినిమా అయినా ఖచ్చితంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. అందుకే ఎంతో ఆలోచించి చిరంజీవి 151వ సినిమాను ఖరారు చేయడం జరిగింది.
చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిరు 151వ సినిమా ఖరారైంది. దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. బాహుబలి స్ఫూర్తితో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ మరియు తమిళంలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే చరణ్ ఏకంగా 130 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ టైటిల్‌ను అనుకున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు 151వ సినిమా టైటిల్‌ను మార్చాలని భావిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో అన్ని భాషల్లో కూడా ఒకే టైటిల్‌ను పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తరహాలో టైటిల్‌ను అన్ని భాషల్లో ఒక్కటే నిర్ణయిస్తే ప్రమోషన్ విషయంలో లాభం ఉంటుందని యూనిట్ సభ్యుల ఆలోచనగా తెలుస్తోంది. ఆగస్టు నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి వరకు టైటిల్‌పై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. వచ్చే సంవత్సరం వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని మెగా వర్గాల వారు అంటున్నారు.
