అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సమావేశం…

జూబ్లిహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జున లతో సమావేశం నిర్వహించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ,కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రి.

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన మంత్రి

కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్ మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ చెయాలి

సినీ, టి వి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశం

సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు త్వరితగతిన అనుమతులు

Fdc ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతాం

పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కోసం శంషాబాద్ పరిసర ప్రాంతాల లో అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు సోమవారం జూబ్లిహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో లో సీనియర్ సినీనటులు చిరంజీవి, నాగార్జున, రెవెన్యు, హోం, న్యాయ తదితర శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, కళాకారుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. చిత్ర పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని మంత్రి వివరించారు. ప్రస్తుతం సినిమారంగం కోరుకుంటున్న అంశాలపై త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు తీసుకునేల తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఫిలిం ఇనిస్టిట్యూట్ నిర్మాణం కోసం అన్ని విధాలుగా అందుబాటులో ఉండే స్థలం కేటాయించాలని నటులు చిరంజీవి, నాగార్జున మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సమావేశానికి హాజరైన రాజేంద్రనగర్ RDO చంద్రకళ ను ఫిలిం ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని వెంటనే సేకరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా సినీ, టివి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం చిత్రపురి కాలనీ తరహాలో పరిసర ప్రాంతాల లో మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని వారు కోరారు. కల్చరల్ ప్రోగ్రాం ల నిర్వహణకు, 24 విభాగాల సినీ కళాకారులకు సాంకేతిక నైపుణ్యం పెంపుకోసం అవసరమైన శిక్షణా కేంద్రం నిర్మాణానికి జూబ్లిహిల్స్, నానక్ రాం గూడ ప్రాంతాలలో స్థలాలు కేటాయించాలని సినీనటులు ప్రతిపాదించారు. ఇందుకు స్పందించిన మంత్రి వెంటనే స్థలాల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోట్లాది రూపాయలతో సినిమాలు నిర్మిస్తే పైరసీ కారణంగా నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని, పైరసీ నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరగా, పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేలా ప్రణాలికలు రూపొందిస్తుందని మంత్రి వివరించారు. టికెట్ ల అమ్మకాల లో పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం రూపొందించిన అజ్ లైన్ టికెటింగ్ విధానం వెంటనే అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తద్వారా ఇటు నిర్మాతలకు, ప్రేక్షకులకు ఎంతో లబ్ది చేకూరుతుందని, ప్రభుత్వానికి కూడా అవసరమైన మేర పన్నులు వసూలు అవుతుందని వారు సూచించారు. అయితే ఈ విధానం ప్రభుత్వం వద్ద సిద్దంగా ఉందని, కొందరు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో అమలుకు ఆలస్యం జరుగుతుందని, దీనిపై సమగ్ర సమాచారాన్ని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు మంత్రి వివరించారు. సాద్యమైనంత త్వరలో అన్ లైన్ టికెట్ విధానం అమలులోకి వస్తుందని, దీని ద్వారా ప్రేక్షకుడు ప్రస్తుతం చెల్లిస్తున్న సర్వీస్ చార్జి ల నుండి ఉపశమనం కలుగుతుందని వివరించారు. దీని అమలు విధానం, కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పవర్ పాయింట్ ద్వారా వివరించారు. చలనచిత్ర రంగంలో పనిచేస్తున్న సుమారు 28 వేల మంది కళాకారులకు FDC ద్వారా గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని, క్యాన్సర్ వంటి ప్రాణాంత కరమైన వ్యాధుల చికిత్సకు అవసరమైన ఆరోగ్య భీమా పథకాన్ని అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కొంతమంది కళాకారులు సినిమాలలో అవకాశాలు లభించని సమయాలలో ఆర్ధిక సమస్యల కారణంగా వైద్యానికి నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాంటి వారు ఎవరైనా ఉంటె వారి వివరాలు తన దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని, గతంలో కూడా చలనచిత్ర పరిశ్రమకు చెందిన అనేక మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. ESI ద్వారా గాని, అందుబాటులో ఉన్న మరి ఏ ఇతర మార్గాలలో సినిమా కళాకారులు అందరికి ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని FDC, ESI అధికారులను ఆదేశించారు. కొత్త సినిమాలు విడుదల సమయాలలో టికెట్ల ధరలను పెంచి, తగ్గించుకొనే అవకాశాన్ని దియేటర్ల యాజమాన్యాలకు కల్పించాలని వారు కోరగా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో అమలు అవుతున్న సినిమా టికెట్ల ధరల సమాచారాన్ని సేకరించాలని FDC అధికారులను మంత్రి ఆదేశించారు. సినిమా షూటింగ్ ల అనుమతుల కోసం వివిధ శాఖల నుండి అనుమతులు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు పేర్కొనగా, సింగిల్ విండో విధానంలో FDC ఆధ్వర్యంలో షూటింగ్ అనుమతులు ఇచ్చేలా వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో FDC మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, నిర్మాత నిరంజన్, FDC ED కిషోర్ బాబు, హోం శాఖ డిప్యూటి సెక్రెటరీ ప్రసాద్, న్యాయ శాఖ డిప్యూటి సెక్రెటరీ మన్నన్ పారూఖి, రాజేంద్రనగర్ RDO చంద్రకళ, సికింద్రాబాద్ RDO వసంత, ఇబ్రహీంపట్నం RDO అమర్నాథ్, ESI తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

To Top

Send this to a friend