బాబు నియంత్రణ కోల్పోతున్నాడా.?


ఒక పార్టీని నడిపిస్తున్న వ్యక్తి ఆయన.. ఒక రాష్ట్రానికి సీఎం కూడా.. అలాంటి వ్యక్తి కనుసైగ చేస్తే అన్నీ సిద్ధం కావాల్సిందే.. కానీ ఇప్పుడక్కడ ఆయన పార్టీ ఎమ్మెల్యేలే ఆయన మాట వినడం లేదు. రమ్మని ఆహ్వానం పంపినా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరుకాలేదు.. పట్టుకోల్పోతున్న ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రత్యేక కథనం..

* ప్రభుత్వ కార్యక్రమాలకు డుమ్మా..

జూన్ 2 తెలంగాణ ఆవిర్భవించిన రోజు… అది వారికి పండుగ రోజు.. ఏపీకి మాత్రం అదో బాధకరమైన రోజు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి కనీసం రాజధాని కూడా లేకుండా ఏపీ నాయకులను కట్టబట్టలతో వెళ్లగొట్టిన రోజు.. అందుకే ఆ బాధలోనే ఏపీ సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష పేరుతో ఏపీ పునర్నిర్మాణ బాధ్యతను గుర్తు చేసుకునేలా దీక్షలు చేపట్టాడు. దీనికి ప్రభుత్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరుకావాలని అల్టిమేటం జారీ చేశారు. కానీ దీనిపై ఏ ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధి కానీ ఆసక్తి చూపకపోవడం నెవ్వరపరుస్తోంది..

*బాబు సీరియస్

చంద్రబాబు అమరావతి వేదికగా నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు హాజరు కాలేదు. దాంతో పాటు చాలా మంది ఉన్నతాధికారులు పాల్గొనలేదు. దీనిపై తన నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం కల్పించిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు దూరంగా ఉండటాన్ని బాబు జీర్ణించుకోలేకపోయారు. వారందరికి వార్నింగ్ ఇవ్వనున్నట్టు నేతలతో చెప్పారట..

*ఇలాగైతే కష్టమే బాబూ..

మూడేళ్లు గడిచేసరికే చంద్రబాబు పార్టీపై, ప్రభుత్వంపై నియంత్రణ కోల్పోయాడని.. ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడమే దీనికి పెద్ద ఉదాహరణ అని ప్రతిపక్షాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల వరకు చంద్రబాబు పార్టీపై పట్టుకోల్పోవడం ఖాయమని.. అసమ్మతి, నిరసనలు చెలరేగి పార్టీపై నియంత్రణ లేక ఓడిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మరి కట్టుతప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులను బాబు ఎలా కట్టడి చేస్తారో చూడాల్సిందే..

To Top

Send this to a friend