బాబు బెదిరింపులు.. ఓటేస్తావా.? వెనక్కిస్తావా..?

దీనికి ఆయన మహారాజు మరి.. సువిశాల ఆంధ్రప్రదేశ్ రాజ్య ధన, మాన , ప్రాణ , ఆస్తుల సంరక్షుడిగా చంద్రబాబు బాహుబలిలా కాకుండా భళ్లాల దేవుడిలా పాలించేస్తున్నాడు. ‘మీకు రోడ్లు వేయించా.. బతకడానికి పింఛన్ ఇస్తున్నా.. తినడానికి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా.. రైతులకు రుణమాఫీ చేశా.. పంటలు పండించుకోవడానికి ఉచిత కరెంట్ ఇస్తున్నా… అయినా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానంటే అవన్నీ నాకు తిరిగేచ్చేయండి.. లేకపోతే ఊరుకోను.. ’ అంటూ స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పెద్దాయన చంద్రబాబు ప్రజలను బెదిరింపులకు గురిచేయడం తాజా సంచలనం.. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

నంద్యాల ఉప ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు. తమ సమస్యలు చెప్పుకుందామని కొందరు ప్రజలు బాబు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలను బెదిరించారు. ‘నేనూ వైసీపీలా ఓటుకు రూ.5వేలు ఇవ్వగలను. కానీ మళ్లీ అవినీతి చేయాల్సి ఉంటుంది. అందుకే నేను అలా చేయను. నా రోడ్లపై నడుస్తూ, నా పింఛన్లు తీసుకుంటున్న మీరు నాకే ఓటేయాలి. నాకు ఓటేయకపోతే పెన్షన్లు, రేషన్ తీసుకోవద్దు.. నాకు కొందరు గ్రామస్థులు నమస్కారమే పెట్టడం లేదు’ అంటూ బెదిరించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

ముఖ్యమంత్రి.. ప్రజలు ఎన్నుకుంటే అవుతారు.. తిరస్కరిస్తే పోతారు. ప్రజల చేత ప్రజల కొరకు సేవకుడిగా చేయాలి. చంద్రబాబు బెదిరించినట్టు అవేమీ ఆయన రోడ్లు కాదు.. ఆయన ఇంట్లోంచి పింఛన్ ఇవ్వడం లేదు. ఆయన భూమిలో పండించి రేషన్ ఏమీ ఇవ్వడం లేదు. అయినా ఆయన సొంత జాగీరులా నేనిస్తున్నానంటూ ఘీంకరిస్తున్నారు. ప్రజలు పన్నులు కడితేనే ప్రభుత్వం నడిచేది.. చంద్రబాబు బతికేది. అవి వారి డబ్బులు. వారికి ఖర్చుపెట్టాలి. కానీ చంద్రబాబు నా రోడ్లు, నా పింఛన్ అంటూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది.

చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend