అయ్యఅవ్వ లేనోళ్లపై పోటీపెడతావా.?

జగన్ పై సెంటిమెంట్ అస్ట్రాన్ని ప్రయోగించి చంద్రబాబు యాంటిమెంటు పూశారు. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో కర్నూలులో పర్యటించిన చంద్రబాబు .. జగన్ పై విమర్శలు గుప్పించారు. నంద్యాలలో గెలిచే ఎమ్మెల్యే కు కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే పదవికాలం ఉన్నా కూడా జగన్ దాన్ని దక్కించుకోవడానికి తపనపడడం విస్మయం కలిగిస్తోందని బాబు మండిపడ్డారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చనిపోతే ఆయన భార్య వైఎస్ విజయలక్ష్మీపై తాము పోటీ పెట్టలేదన్నారు. మానవతా దృక్పథంతో మేం ఆలోచిస్తే జగన్ మాత్రం.. భూమా నాగిరెడ్డి చనిపోతే ఆయన స్థానంలో పోటీపెడుతున్నాడని చంద్రబాబు విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రతిపక్ష వైసీపీని కోరామని.. కానీ ఆ సంప్రదాయానికి విలువ ఇవ్వకుండా ఏడాదిన్నర పదవి కోసం తల్లిదండ్రులు కోల్పోయిన భూమా ఫ్యామిలీపై జగన్ పోటీ పెడుతున్నారని బాబు ఆరోపించారు. జగన్ కు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని బాబు స్పష్టం చేశారు.

2019 ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నికల్లో గెలుపే ఇరు టీడీపీ, వైసీపీలకు కీలకంగా మారబోతోంది. అందుకే ఈ గెలుపుకోసం ఇప్పుడు చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి నంద్యాల ప్రజల సానుభూతిని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ జగన్ వైసీపీని ఎదుర్కోవడానికి ఇలా చంద్రబాబు కొత్త ఎత్తు వేశారు. ఆ ఎత్తు పారుతుందో లేదో చూడాలి.

To Top

Send this to a friend