చలపతిరావు వివాదం.. సినిమాలో కీలక మార్పులు

నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన వేడుక సందర్బంగా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని నాగచైతన్య చెప్పిన డైలాగ్‌ను హైలైట్‌ చేసే ప్రయత్నం చేశారు. అయితే అదే వేడుకలో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాపైనే ప్రభావాన్ని చూపుతున్నాయి. చలపతిరావు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పడం జరిగింది.

క్షమాపణలు చెప్పినా కూడా మహిళ సంఘాల వారు ఆగ్రహంతోనే ఉన్నారు. చలపతిరావు మరియు యాంకర్‌ రవిని నిర్బయ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమయంలోనే ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రం నిర్మాత అయిన అక్కినేని నాగార్జున సినిమాలో కీలక మార్పులు చేర్పులు చేయించినట్లుగా తెలుస్తోంది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్‌ను సినిమా నుండి తొలగించడం జరిగింది. అలాగే సినిమాలోని చలపతిరావు పాత్రను చాలా వరకు తగ్గించి, ఆ పాత్రకు డైలాగ్స్‌ను కూడా తగ్గించినట్లుగా చెబుతున్నారు.

చలపతిరావు సినిమాలో కనిపించడంతో పాటు, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ ఉండే డైలాగ్స్‌ వల్ల సినిమాపై కూడా విమర్శలు వస్తాయని, అందుకే నాగార్జున ఈ పని చేయించినట్లుగా తెలుస్తోంది. రేపు విడుదల సందర్బంగా నిన్నటి నుండే చిత్ర యూనిట్‌ సభ్యులు ఇదే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ఓవర్సీస్‌కు సంబంధించిన ప్రింట్స్‌ వెళ్లి పోయిన నేపథ్యంలో అక్కడ చైతూ ఆ డైలాగ్‌ను చెప్తాడని తెలుస్తోంది. మొత్తానికి చలపతి రావు వ్యాఖ్యలు నాగార్జునకు చెమటలు పట్టిస్తున్నాయి.

To Top

Send this to a friend