కార్బన్‌ డై ఆక్సైడ్‌ తోనే మన మనగడ

భూతాపంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ప్రభావం ఉందా?  గ్లోబల్‌ వార్మింగ్‌’లో వాతావరణంలో అతి తక్కువగా ఉండే కార్బన్‌ డై ఆక్సైడ్‌ పాత్ర ఏమిటి?

భూ వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ పాలు అతి తక్కువయినా అది భూమి నుంచి వెలువడే ఉష్ణాన్ని పట్టి ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. భూ ఉపరితలం సూర్యుని నుంచి వెలువడే కాంతి కిరణాలలోని ఉష్ణాన్ని పట్టి ఉంచుతుంది. అదే సమయంలో భూమి తిరిగి రోదసిలోకి వెలువరించే పరారుణ కిరణాలు భూమికి చల్లదనాన్ని కలగజేస్తాయి. భూ ఉపరితలం ఎంత ఎక్కువగా సూర్యరశ్మిని శోషించుకుంటుందో అంతే ఎక్కువ పరిమాణంలో భూమి నుంచి పరారుణ కిరణాలు రోదసిలోకి విడుదల అవుతాయి. సూర్యుని నుంచి భూమి ఎంత ఉష్ణాన్ని శోషించుకుంటుందో అందుకు సమానంగా రోదసిలోకి భూమి నుంచి ఉష్ణం వెలువడే వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాతావరణంలో 99 శాతం వరకు ఉండే నైట్రోజన్‌, ఆక్సిజన్‌, ఆర్గాన్‌ వాయువులు కంటికి కనబడే కాంతి గానీ, పరారుణ కిరణాలను గానీ శోషించుకోలేవు. దాంతో ఆ రెండు రకాల వాయువులు ఎలాంటి అడ్డంకి లేకుండా రోదసిలోకి తప్పించుకుపోతాయి. అయితే ఇక వాతావరణంలో మిగిలి ఉన్న నీటి ఆవిరి, కార్బన్‌ డై ఆక్సైడ్‌లు భూమి విడుదల చేసే పరారుణ కిరణాలలోని కొంత శాతాన్ని రోదసిలోకి తప్పించుకుపోకుండా శోషించుకుని పట్టి ఉంచుతాయి. దీనినే ‘గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌’ అంటారు. ఈ ప్రభావమే లేకపోతే భూమి కూడా అంగారక గ్రహంలాగా మంచుతో ఘనీభవించి ‘జీవం’ లేకుండాపోయేది. వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ పాలు తక్కువయినప్పటికీ ఆ వాయువు శోషించుకున్న ఉష్ణాన్ని వాతావరణంలో అతిగా ఉండే నైట్రోజన్‌, ఆక్సిజన్‌, ఆర్గాన్‌ వాయువులు పంచుకోవడంతో వాతావరణం భూమిపై ఒక దుప్పటిలాగా ఏర్పడి ఉష్ణం భూమి నుంచి రోదసిలోకి తప్పించుకుని పోకుండా ఒక రక్షణ కవచం పాత్ర వహిస్తుంది.

To Top

Send this to a friend