అమరావతి భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది ?

రాజధాని అమరావతి భవిష్యత్తు స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ లాగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నది, జగన్మోహన్ రెడ్డి పాలసీ స్పష్టం గా ఉంది. అమరావతి లో రాజధాని నిర్మాణం ఆయనకు ఇష్టం లేదు,అమరావతి నిర్మాణం వల్ల టీడీపీ వారికి లాభం తప్ప తమకు లాభం లేదని వైసీపీ భావిస్తున్నది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరావతి నుండి రాజధాని ని తరలించడానికి జగన్మోహన్ రెడ్డి సకల శక్తులు ఉపయోగిస్తున్నారు,ఆయనను అడ్డుకునేందుకు టీడీపీ శక్తి సామర్థ్యం సరిపోవడం లేదు. అసెంబ్లీ లో వైసీపీ టీడీపీ ని పరాభవించడానికి సమయం వెచ్చిస్తున్నది తప్ప ప్రజా సమస్యలపై చర్చించడం లేదు.ఈ పరిస్థితులలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తీవ్రమైన ఒత్తిడి కి లోనవుతున్నారు.అమరావతి పరిరక్షణ సమితి కి కూడా భవిష్యత్తు పై స్పష్టమైన కార్యాచరణ కానీ , వ్యూహం కానీ ఉన్నట్లుగా అనిపించడం లేదు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలు కోరుతున్నప్పటికీ న్యాయస్థానం తప్ప తమకు ఎవరూ సహాయం చేయలేరని నమ్ముతున్నారు.అమరావతి నుండి రాజధాని ని తరలించడానికి ఎంతకైనా సిద్ధం అని శాసన మండలి రద్దుచేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు.న్యాయస్థానం ని కూడా ధిక్కరించి కర్నూలు కి విజిలెన్స్, అప్పీలీట్ ట్రిబ్యునల్ కార్యాలయాలు కర్నూలు కి తరలించడానికి,విశాఖపట్నం లో సెక్రటేరియట్, ఇతర కార్యాలయాలకు లాండ్ పూలింగ్ కి సిద్ధపడ్తున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి రాజధాని రైతులను కన్నీళ్ళు పెట్టిస్తూ, నిరాశ నిస్పృహ కి గురిచేస్తోంది,రాజధాని అమరావతి పోరాటం లో అంతా తానే అయ్యి ,వైసీపీ ని ఎదుర్కొని రాష్ట్రంలో బలపడడానికి టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నది.

ప్రతి రాజకీయ పార్టీ తమ కు లాభం లేకుండా ఏమీ చేయదు,బీజేపీ ఈ పరిస్థితి ని నిశితంగా పరిశీలిస్తోంది.అమరావతి పోరాటం లో టీడీపీ బలపడి, తనకు ఏమీ ఉపయోగం లేదు అని బీజేపీ భావిస్తే అది అమరావతి ప్రాంతం రైతులకు తీవ్రమైన నష్టం కలుగచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ని ఆయన పై ఉన్న కేసుల వల్ల నయానో భయానో దారికి తెచ్చుకోవడం బీజేపీ వల్లనే సాధ్యం తప్ప, టీడీపీ వల్ల సాధ్యం కాదు.ఐతే ఇది జరగాలి అంటే టీడీపీ బలహీన పడి, ఆ స్థాయిలో బీజేపీ రాష్ట్రంలో బలపడాలి,ఇప్పటికిప్పుడు టీడీపీ ని బలహీనపరిస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడుతుంది అని వైసీపీ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది.కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ని ఇప్పటికిప్పుడు ఎదుర్కోవడం వైసీపీ కి ఇష్టం లేదు. అలాంటి పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి పై ఉన్న కేసుల విషయంలో ఇబ్బందులు ఎదురు అవుతాయి అని వైసీపీకి స్పష్టంగా తెలుసు. బలహీన పడిన చంద్రబాబు ని ఎదుర్కోవడం వైసీపీకి తేలిక. అందుకే టీడీపీ పై అవినీతి ఆరోపణలు తప్ప న్యాయవిచారణ కు ఆదేశించడం లేదు.అంటే చంద్రబాబు బలహీన పడాలి,బీజేపీ బలపడకూడదు.
ఇదే వైసీపీ వ్యూహం,టీడీపీ లో నాయకత్వం లో ఉన్న ప్రధాన సామాజిక వర్గానికి ఇది ఒక పెద్ద చిక్కు ప్రశ్న గా మారింది. తాము ఎన్నో సంవత్సరాలు శ్రమకోర్చి నిర్మించిన టీడీపీ ని వదిలిరాలేకపోతున్నారు. బీజేపీలో కి రాకుండా వైసీపీ ని ఎదుర్కోవడం కష్టం అని తెలిసి కూడా నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. కానీ ఆ సామాజిక వర్గానికి వైసీపీ నుండి రక్షణ కావాలంటే వారు బీజేపీ లోకి రాక తప్పని పరిస్థితి ఉంది.మరొక 4 సంవత్సరాల పాటు వైసీపీ దుందుడుకు చర్యలు తట్టుకోవడం కూడా వారికి కష్టమే,టీడీపీ చరిత్రలో ఎన్నడూ మిత్రపక్షాల సహాయం లేకుండా గెలుపొందలేదు.అంటే టీడీపీ కి ఉన్న సొంత బలం తో వైసీపీ పై గెలుపొందడం సాధ్యం కాదు.టీడీపీ కి చెందిన
ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లినా అది రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో తన ఓటు బ్యాంకు 1% కూడా పెంచదని బీజేపీ భావిస్తున్నది.అందుకే క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి జనసేనతో బీజేపీ జతకట్టింది,రాజధాని రైతులకు అండగా నిలబడి,రాజధాని తరలింపు అడ్డుకోగలిగిన శక్తులు బీజేపీ, న్యాయస్థానాలు మాత్రమే. కానీ న్యాయస్థానాలకు కూడా పరిమితులుంటాయి.కానీ నయానో భయానో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగలిగింది బీజేపీ మాత్రమే అని అర్ధం చేసుకోగలిగిన నాడు రాజధాని అమరావతి లొనే ఉంటుంది .బీజేపీ కి అమరావతి పై ఆసక్తి తగ్గితే ,వైసీపీ తనకు నచ్చిన విధంగా అమరావతి ని నిర్వీర్యం చేస్తుంది. ఆలోచించాల్సింది,నిర్ణయం తీసుకోవాల్సింది టీడీపీ,అమరావతి రైతులే.
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend