బన్నీ మూడు సంవత్సరాలుగా ఇదే మాట అంటున్నాడు!


టాలీవుడ్‌ హీరోల్లో కేవలం అల్లు అర్జున్‌కు మాత్రమే మలయాళ ప్రేక్షకుల్లో ఫ్యాన్స్‌ ఉన్నారు. అది కూడా మామూలు ఫ్యాన్స్‌ కాదు. తెలుగులో ఆయన్ను ఏ స్థాయిలో అభిమానిస్తారో అదే స్థాయిలో మలయాళంలో కూడా అల్లు అర్జున్‌ను అభిమానించే ఫ్యాన్స్‌ ఉన్నారు. అల్లు అర్జున్‌ ప్రతి సినిమా కూడా మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంటూ ఉంది. అక్కడ స్టార్‌ హీరోలకు సమానంగా అల్లు అర్జున్‌ చిత్రాలు వసూళ్లను రాబడుతున్నాయి అంటే బన్నీ స్థాయి అక్కడ ఏ రేంజ్‌లో ఉందో చెప్పుకోవచ్చు.

తనపై ఎంతో అభిమానం చూపిస్తున్న మలయాళ ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాను అంటూ పదే పదే బన్నీ చెబుతూనే ఉన్నాడు. గత మూడు సంవత్సరాలుగా అల్లు అర్జున్‌ మలయాళంలో డైరెక్ట్‌ చిత్రం చేస్తానంటూ చెబుతున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్‌ కార్యక్రమం నిమిత్తం కేరళ వెళ్లిన సమయంలో అల్లు అర్జున్‌కు అక్కడ ఏ స్థాయి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో అర్థం అయ్యింది. బన్నీని చూసేందుకు జనాలు భారీగా రావడంతో మీ కోసం ఒక డైరెక్ట్‌ మలయాళ సినిమా చేస్తాను అంటూ అప్పుడు హామీ ఇచ్చాడు.

అప్పటి నుండి కూడా తన ప్రతి సినిమా విడుదల సమయంలో మలయాళంలో ఒక డైరెక్ట్‌ చిత్రం చేస్తాను అంటూ చెబుతూ వస్తున్నాడు. తాజాగా ‘డీజే’ చిత్రం విడుదల సమయంలో కూడా తన మలయాళ ఫ్యాన్స్‌ రుణం తీర్చుకునేందుకు ఒక డైరెక్ట్‌ చిత్రం చేస్తానంటూ హామీ ఇచ్చాడు. అయితే టెక్నికల్‌గా బన్నీ మలయాళ సినిమా చేయడం అంటే చాలా కష్టం. ప్రస్తుతం బన్నీ చిత్రం చేయాలంటే మినిమం 30 కోట్ల బడ్జెట్‌ ఉండాలి. కాని మలయాళంలో స్టార్‌ హీరోల సినిమాల బడ్జెట్‌ కూడా 10 నుండి 15 కోట్లు మాత్రమే ఉంటుంది. అక్కడ మార్కెట్‌ తక్కువగా ఉంటుంది. అందుకే బన్నీ మలయాళంలో సినిమా చేయడం అనేది దాదాపు అసాధ్యం.

To Top

Send this to a friend