అమరలోకాలకు అతిలోకసుందరి శ్రీదేవి..

అతిలోకసుందరి, అనిర్వచనీయమైన నటనాపాటవాన్ని తనసొంతం చేసుకున్న హీరోయిన్, శ్రీదేవి ఇకలేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఆమె దుబాయ్ లో కన్నుమూశారు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరు కావడానికి కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన ఆమె శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో మరణించినట్లుగా సమాచారం. మరణ వార్తను భర్తకపూర్ ధ్రువీకరించారు. సినిమా షూటింగ్ కారణంగా కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లలేకపోయిన శ్రీదేవి పెద్దకుమార్తె జాన్వీ కపూర్ కూడా.. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే షూటింగ్ రద్దు చేసుకుని దుబాయ్ బయల్దేరి వెళ్లినట్లు సమాచారం.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తిరుగులేని అసామాన్యమైన కథానాయికగా ఎంతోమంది గుండెల్లో చిరస్థాయిగా కొలువుదీరిన హీరోయిన్ శ్రీదేవి ఇకలేరు. చిలిపితనంతో కూడిన తన నటనా ప్రావీణ్యంతో కొన్ని దశాబ్దాల వెండితెర ద్వారా రసాత్మక హృదయాలకు గిలిగింతలు పెట్టిన అభినేత్రి శ్రీదేవి కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ను ఇప్పుడే హీరోయిన్ గా పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో తన వారసురాలిగా కూతురును చూసుకోవాలనే కోరిక తీరకుండానే… శ్రీదేవి దివికేగడం అభిమాన ప్రపంచానికి జీర్ణం కావడంలేదు.

మహానటి శ్రీదేవి 1963 ఆగగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. 55ఏళ్ల శ్రీదేవి జీవితంలో సింహభాగం సినీప్రపంచపు వెలుగుజిలుగుల్లోనే గడచిపోయింది. 1967లో బాలనటిగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన శ్రీదేవి అయిదు దశాబ్దాలుగా ఈ రంగంపై, భారతీయ సినీ అభిమానులు మాత్రమే కాకుండా.. ప్రపంచ సినీప్రియుల గుండెలపై తనదైన ముద్రవేశారు.

ఒక శకానికి నాయిక

భారతీయ సినిమా హీరోయిన్ల చరిత్రను గనుక చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా ‘‘శ్రీదేవికి ముందు.. శ్రీదేవికి తర్వాత..’’ అని చెప్పుకోవాల్సిందే. అందంలో శ్రీదేవిని మించిన నటీమణులు ఎందరో అంతకు ముందు కూడా వచ్చారు.. ఆ తర్వాత కూడా వచ్చారు. అదే మాదిరిగా అభినయంలోనూ ఆమెను అధిగమించగలవారు అస్సలు లేరని చెప్పడానికి కూడా వీల్లేదు. కానీ.. అందం, అభినయాల కలబోతగా.. అయిదు దశాబ్దాలు చిత్రపరిశ్రమకు సామ్రాజ్ఞిగా వెలుగొందడం అనేది… మహారాణిలా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత సామాన్యమైన విషయంకాదు.

మహానటి శ్రీదేవి పవిత్ర స్మృతికి www.apnewsonline.in  నివాళి అర్పిస్తున్నది.

To Top

Send this to a friend