బీజేపీ పెద్దలకు షాక్..


1992 డిసెంబర్ 6న విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు ధ్వంసం చేసిన ప్రఖ్యాత బాబ్రీ మసీదు కేసును సుప్రీంకోర్టు తిరగదోడింది. 25 ఏళ్ల నాటి కేసులో బీజేపీ పెద్దలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలపై అభియోగాలను నిజమేనని.. వారిపై విచారణ చేయాల్సిందేనని సంచలన తీర్పునిచ్చింది. అడ్వాణీ, జోషి, ఉమాభారతిలు 16 వ శతాబ్ధం నాటి బాబ్రీమసీదు కూల్చివేతలో కుట్ర పన్నారని.. వీరు దోషులేనని విచారణ జరగాల్సిందేనని సుప్రీం తీర్పునివ్వడం దేశవ్యాప్తంగా దుమారం రేగింది.

* బాబ్రీ కేసు ఇదీ..
బాబ్రీ మసీదు స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని.. హిందువులు నమ్ముతారు. 2.7 ఎకరాల్లో విస్తరించిన ఈ వివాదస్పద స్థలంపై హిందూ ముస్లింల మధ్య వివాదం చెలరేగుతోంది. దీనిపై 1990లోనే అడ్వాణీ దేశవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించారు. ఈ బాబ్రీ కూల్చివేతలో అడ్వాణీ హస్తం ఉందని సీబీఐ కోర్టులో పిటీషన్ ఆధారాలు చూపించినా అలహాబాద్ కోర్టు సరైన ఆధారాలు లేవంటూ 2001లో కేసు ను కొట్టివేసింది. ఆ తర్వాత సీబీఐ దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. కోర్టు విచారణ కు స్వీకరించి అడ్వాణీ, జోషి, ఉమాభారతిలపై నేరారోపణలు పునరుద్ధరించాలని లక్నో ట్రయల్ కోర్టులో విచారించాలని.. రెండేళ్లలో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు.

* అడ్వాణీ రాష్ట్రపతి ఆశ గల్లంతు.?
బాబ్రీ మసీదు కేసు అడ్వాణిని ముప్పై ఏళ్లుగా వెంటాడుతోంది. ఈ కేసును అప్పట్లో కిందికోర్టు కొట్టేసినా.. ఇప్పుడు సుప్రీం కోర్టు మరోసారి తిరగదోడడంతో అడ్వాణి ఇరకాటంలో పడ్డాడు. వచ్చే జూన్ లో రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరఫున బరిలో నిలవాలనుకుంటున్న అడ్వాణికి ఈ తీర్పు శరాఘాతంగా మారింది. ఆరోపణలున్నాయని అడ్వాణిని మోడీ పక్కనపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తంగా బాబ్రీ కేసు ఈ 82ఏళ్ల కురువృద్ధుడు అడ్వాణీకి శాపంగా మారింది.

To Top

Send this to a friend