‘బంగారు తెలంగాణ’ ప్రెస్ మీట్

ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.గారు చేస్తున్న కృషికి ప్రతిరూపమే మా ‘బంగారు తెలంగాణ’
– నిర్మాత మందల విజయభాస్కర్‌ రెడ్డి
బిపిన్‌, రమ్య జంటగా షిరిడిసాయి క్రియేషన్స్‌ పతాకంపై కూర అంజిరెడ్డి సమర్పణలో బిపిన్‌ దర్శకత్వంలో మందల విజయభాస్కర్‌రెడ్డి, బిపిన్‌, రమ్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బంగారు తెలంగాణ’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్‌ నెలలో ఆడియో రిలీజ్‌ చేసి, జూలైలో సినిమా రిలీజ్‌ చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బిపిన్‌, నిర్మాతలు మందల విజయభాస్కర్‌రెడ్డి, రమ్య, సమర్పకులు కూర అంజిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేక్‌ని కట్‌ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.
‘బంగారు తెలంగాణ’ చిత్రానికి రాయితీలు కల్పించాలి!!
సమర్పకులు కూర అంజిరెడ్డి మాట్లాడుతూ – ”ఈ చిత్ర కథ విషయానికొస్తే… 1969లో వివేకవర్ధిని కళాశాలలో తొలి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆనాటి నుండి నేటి శ్రీకాంతాచారి వరకు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహారదీక్ష చేశారు. అలాగే అనేకమంది ఎన్నో ఉద్యమాలు చేశారు. అందరి సమిష్టి కృషి ఫలితంగా బంగారు తెలంగాణ సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలందరికీ మేలు కలిగేలా తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నారు. చండీయాగం తలపెట్టి రాష్ట్ర బాగుకోసం అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది? చిత్ర మెయిన్‌ కాన్సెప్ట్‌. ఈ చిత్రానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారు ప్రభుత్వ రాయితీలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత మందలి విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ – ”షూటింగ్‌ అంతా పూర్తయింది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్‌ నెలలో ఆడియో రిలీజ్‌ చేసి, జూలైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. అవన్నీ ప్రజలకు ఎంతో మేలు కలిగించేలా వున్నాయి. ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారు చేస్తున్న కృషికి ప్రతిరూపమే మా ‘బంగారు తెలంగాణ’ చిత్రం. అవన్నీ మా చిత్రంలో పొందుపరిచాం. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారికి స్పెషల్‌ షో వేసి చూపిస్తాం” అన్నారు.
దర్శకుడు బిపిన్‌ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో నేను, నా శ్రీమతి రమ్య ముఖ్య పాత్రల్లో నటించాం. కథ, మాటలు, స్క్రీన్‌ప్లేతో పాటు సంగీతాన్ని కూడా అందించాను. ఐదు అద్భుతమైన పాటలు వున్నాయి. టాప్‌ సింగర్స్‌ అందరూ ఈ పాటలు పాడారు. ‘బంగారు తెలంగాణ’ చిత్రానికి వినోదపు పన్ను రాయితీ కల్పించాలని ముఖ్యమంత్రిగారిని కోరుతున్నాం. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం నుండి నేటి గ్రేటర్‌ ఎన్నికల వరకు తెలంగాణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో, అలాగే ఉద్యమంలో ఎంతోమంది యువకులు ప్రాణత్యాగం చేశారో అవన్నీ ఈ చిత్రంలో చూపిస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌గారు ‘బంగారు తెలంగాణ’ కోసం నిరంతరం అలుపెరుగని కృషి చేస్తున్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేలా ఈ చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఈ చిత్రాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌గారికి, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు అంకితం చేస్తున్నాం” అన్నారు.
రఘునాధరెడ్డి, బాబుమోహన్‌, గౌతంరాజు, జాకీ, ప్రసన్నకుమార్‌, ఎ.వి. స్వామి, గుండు హనుమంతరావు, రజిత, ప్రీతినిగమ్‌, రాగిణి, దివ్య, రమ్య, కృష్ణవేణి, కల్పన, క్రాంతి, రోజా, ప్రతిభశ్రీ, సౌజన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు ఎ. నాయుడు, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, కో ప్రొడ్యూసర్స్‌: డా. లయన్‌ ఎ.వి. స్వామి, చెన్నమనేని వినోద్‌, సమర్పణ: కూర అంజిరెడ్డి, నిర్మాతలు: మందల విజయభాస్కర్‌రెడ్డి, బిపిన్‌, రమ్య, కథ- మాటలు – పాటలు – సంగీతం – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: బిపిన్‌.

To Top

Send this to a friend