బాహుబలి సినిమాలోని ప్రతి పాత్రకు దాని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన రాజమౌళి.. ఆ సినిమాను ఓ కళాఖండంగా చెక్కారు. మొదటిపార్ట్ లో కేవలం ఇంట్రడక్షన్ లతోనే సరిపుచ్చి రెండోపార్ట్ లో అసలు కథను చెప్పబోతున్నారు. ఇప్పటికే బాహుబలి టీం ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. రెండోపార్ట్ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో బాహుబలి టీం సినిమాలోని పాత్రల లుక్స్ ను విడుదల చేస్తోంది.
ప్రభాస్ తో అనుష్క బాణం పట్టుకున్న ఫస్ట్ లుక్ విడుదల తర్వాత అనుష్క లుక్ ను ఈరోజు సరికొత్తగా ఆవిష్కరించారు రాజమౌళి. అమరేంద్ర బాహుబలి భార్య పాత్రలో యువరాణిలా రాజదర్పం అనుభవిస్తున్న దేవసేన లుక్ అదిరిపోయేలా ఉంది. కొద్దిసేపటి క్రితమే అనుష్క దేవసేన లుక్ ని బాహుబలి టీం విడుదల చేసింది. కాగా సినిమాలో దేవసేన హుందాగా ఉండే పాత్రలో యుద్ధం చేసే వీరవనితగా మనకు కనిపించబోతున్నట్టు తెలిసింది. ఆ విన్యాసాలేంటో తెరమీదే చూడాలి.
రెండు రోజుల్లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ ఈనెల 28న బాహుబలి విడుదలయ్యే రోజున సెలవు పెట్టాలని బాహుబలి టీం సోషల్ మీడియాలో కోరింది. అంతేకాదు.. లీవ్ లెటర్ ను అందులో పోస్టు చేసింది. ఇందుకోసం బాహుబలి.కామ్ అనే వెబ్ సైట్ సృష్టించడం గమనార్హం.
