బహిరంగసభ వెనుక రహస్యం


తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేసి ఇప్పటికి 16 ఏళ్ళు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇది పార్టీకి మూడో వార్షికోత్సవం.

గత రెండేళ్లలో కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద సభలేమీ పెట్టలేదు. గత రెండేళ్లలో లేనిది ఇప్పుడెందుకు సభ పెడుతున్నారు. ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. 2019 లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే, ఎన్నికలకి ఇంకా రెండేళ్ళు సమయం ఉంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళినా, లేదా దేశమంతా ఒకే సారి ఎన్నికలు జరపాలనే మోది ప్రయత్నం ఫలించినా కూడా 2018 లో కానీ ఎన్నికలు రావు. మరి ఏ ప్రయోజనమూ లేకుండా ఇప్పుడెందుకు సభ పెడుతున్నారు అంటే, దీని వెనుకాల కేసీఆర్ వ్యూహం ఒకటి ఉంది. అదేమిటంటే..

ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళు అవుతున్నా, అరకొర రుణమాఫీ తప్ప ఏ ఒక్క పెద్ద హామీని కేసీఆర్ నేరవేర్చలేకపోవడం తో ప్రజలలో అసంతృప్తి మొదలవుతోంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, లక్ష ఉద్యోగాలు ఈ రెండు హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. ఈ అసంతృప్తిని రాజకీయంగా మరల్చుకొనేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ సిద్ధం అవుతున్నారు. మరోపక్క అమిత్ షా కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టారు. కాంగ్రెస్ కి పెద్దగా ఆశలు లేకపోయినా, హడావిడి అయితే చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, తెలంగాణ లో తానే పెద్ద లీడర్ ని అని, తనకి ప్రజాదరణ తగ్గలేదని, ప్రజలు తమ పట్ల సంతృప్తిగా ఉన్నారని కేసీఆర్ సంకేతాలు పంపదలచుకున్నారు.

ముఖ్యమంత్రి కాకముందు కూడా, కేసీఆర్, పార్టీలో తనకి పట్టు తగ్గుతోందని అనుమానం వచ్చినా, లేదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలన్నా అయితే ఉపఎన్నికలు లేదంటే బహిరంగ సభలు అనే అస్త్రాలని ప్రయోగించేవారు. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి జనంలోకి వెళ్ళడానికి కేసీఆర్ కి నమ్మకం చాలడం లేదు. జనంలో అసంతృప్తి ఉందేమో అనే అనుమానం కేసీఆర్ కి ఉంది, అందుకే ఆయన ఎన్నికలకి వెళ్ళడం లేదు. అందువలన ఇప్పుడు తెలంగాణ లో తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి బహిరంగ సభే మంచి మార్గం అని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 10 లక్షల మందితో వరంగల్ లో సభ జరిపితే చాలు, మళ్ళీ పార్టీ శ్రేణులకి ఊపు వస్తుంది, జనాన్ని చూసుకుని కేసీఆర్ లో విశ్వాసం పెరుగుతుంది, ప్రతిపక్షాలలో ధైర్యం సడలుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వరంగల్ లో భారీ బహిరంగ సభ కి కేసీఆర్ సిద్ధం అయ్యారు.

To Top

Send this to a friend