బాబుతో నస.. కేసీఆర్ తో పదనిస..


తెలంగాణ సీఎం, ఏపీ సీఎం ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రధానితో విడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీని ప్రసన్నం చేసుకోవడంతో పాటు.. తెలంగాణకు సంబంధించిన పనులు చక్కబెట్టుకొచ్చారు..

ఇదే విషయాన్ని నిన్న వ్యవసాయాధికారులతో మీటింగ్ లో కేసీఆర్ గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ తాను తెలంగాణలో రైతుల కోసం ప్రకటించిన ఉచిత ఎరువుల పథకాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని నీతి అయోగ్ సమావేశంలో మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఉచిత ఎరువుల పథకం రుణమాఫీ కంటే మెరుగైనదని అభినందించారని తెలిపారు. ఇవేకాదు తెలంగాణ పెండింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు.

కొద్దికాలంలో ఢిల్లీలో పరిణామాలు కేసీఆర్ కు అనుకూలంగా.. చంద్రబాబుకు ప్రతికూలంగా మారుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం.. ప్రధాని నరేంద్రమోడీని కలవడం.. కేంద్రమంత్రులను కలిసి సమస్యలు ఏకరువు పెట్టడం చూస్తూనే ఉన్నాం. కానీ ఏ ఒక్కపని అనుకున్న టైంకి జరగడం లేదు. నిధులు గట్రా విడుదలలో జాప్యం కొనసాగుతోంది.

కానీ కేసీఆర్ విషయంలో మాత్రం ఢిల్లీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కేసీఆర్ ఆలోచనలు, పథకాలపై ప్రధాని, కేంద్రమంత్రులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కేసీఆర్ కూడా సమస్యల చిట్టా వినిపించకుండా మోడీని పొగడ్తలతో ముంచెత్తి ఫలానా పనిచేస్తే బాగుంటుందని సుతిమెత్తగా చెబుతూ పనులు చేయించుకుంటున్నారట. ఇలా రాజకీయాల్లో తన గురువు అయిన చంద్రబాబునే మించిపోయేలా కేసీఆర్ ఢిల్లీ పెద్దలను మెప్పించాడని బీజేపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

To Top

Send this to a friend