కేశవపై కూడా బాహుబలి ప్రభావం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రం నాలుగు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా కూడా చిత్రంకు భారీ వసూళ్లు వస్తున్నాయి. గత కొంత కాలంగా సినిమాలను ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి తక్కువ సమయంలోనే అంటే వారం లేదా రెండు వారాల్లోనే పూర్తి కలెక్షన్స్‌ను వసూళ్లు చేసుకునేలా నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇటీవల ఏ సినిమా కూడా రెండు వారాలను మించి ఆడిన దాఖలాలు లేవు. మొదటి వారంలో భారీగా కలెక్షన్స్‌ రాబట్టి, రెండవ వారంకు తక్కువ అయ్యి, మూడవ వారంకు పూర్తిగా డ్రాప్‌ అవుతూ వస్తున్నాయి. కాని ‘బాహుబలి 2’ విషయంలో ఆ ఆనవాయితి పూర్తిగా రివర్స్‌ అయ్యింది.

అన్ని సినిమాల మాదిరిగానే మొదటి వారం రోజులే బాహుబలి కూడా సందడి చేస్తాడని సినీ వర్గాల వారు అనుకున్నారు. అందుకే ‘బాహుబలి 2’ విడుదలైన వారం రోజులకే ‘బాబు బాగా బిజీ’ చిత్రాన్ని విడుదల చేశారు. బాహుబలి సునామీలో ఆ చిత్రం కంటికి కనిపించకుండా కొట్టుకు పోయింది. ఆ తర్వాత వారం ‘రాధ’, ‘వెంకటాపురం’ చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలకు కూడా బాహుబలి దెబ్బ తప్పలేదు. ఆ సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ మాత్రం రాలేదు. బాహుబలి విడుదలైన తర్వాత మూడవ వారంలో అంటే గత వారంలో నిఖిల్‌ నటించిన ‘కేశవ’ సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నా కలెక్షన్స్‌ మాత్రం లేవు. బాహుబలి ఇంకా హవా కొనసాగిస్తుంది. దాంతో కేశవకు దెబ్బ తప్పలేదు. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ వారం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాకు కలిసి వస్తుందేమో చూడాలి.

To Top

Send this to a friend