అయ్యో.. శశి.. రెండాకులు దక్కకపాయే..

పాపం శశికళ.. సీఎం పీఠం ఇలా ఎక్కబోతుండగా.. సుప్రీం తీర్పుతో కటకటాల పాలయ్యారు. తన స్థానంలో తన అనుంగ శిష్యుడిని సీఎం పీఠంపై కూర్చొబెట్టాడు. నోటికాడకు వచ్చిన సీఎం పీఠం చేజారిపోయింది. ఇప్పుడు కీలకమైన పార్టీ గుర్తు కూడా శశికళకు దక్కకుండా పోయింది. పన్నీర్ సెల్వం ఈ విషయంలో కీలకపాత్ర పోషించారు. అటు శశికళకు సీఎం పీఠం దక్కకుండా.. ఇటు అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులు దక్కకుండా చేసి పన్నీర్ .. శశికళకు షాక్ ఇచ్చారు..

అన్నాడీఎంకే పార్టీ తమదేనంటూ అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్ వర్గం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ పోటీ చేసే అన్నాడీఎంకే అభ్యర్థికి రెండాకుల గుర్తు ఇస్తారు. ఆ గుర్తు కోసం ఇటు శశికళ, పన్నీర్ లు తమదే పార్టీ అని పోరాడడంతో ఇద్దరికీ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

శశికళ వర్గానికి, పన్నీర్ వర్గానికి ఆ రెండాకుల గుర్తు దక్కబోదని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. ఇరువురూ తమ వాదనల్ని వినిపించే క్రమంలో ఇచ్చిన వివరాలతో కూడి న పేజీలు ఎక్కువయ్యాయని.. వాటిని అంతా విశ్లేషించి చదవాలంటే చాలా సమయం పడుతుందని.. అందుకే ఈ రెండాకుల గుర్తును ఫ్రీజ్ చేస్తున్నామని కమిషన్ స్పష్టం చేసింది. అప్పటివరకు ఎన్నికల్లో ఎవ్వరూ రెండాకుల గుర్తు ఉపయోగించరాదని తేల్చిచెప్పింది.

ఇక ఆర్కేనగర్ బరిలో దిగిన శశికళ, పన్నీర్ వర్గాలకు కొత్త గుర్తుల్ని ఇవ్వనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పార్టీకి గుర్తు చాలా ముఖ్యం. అన్నాడీఎంకే గుర్తు రెండాకులు ప్రజల్లోకి వెళ్లింది. చాలామందికి చేరువైంది. ముసలి ముతకా ఇప్పటికీ ఆ గుర్తుకే వేస్తారు. దీంతో ఈ గుర్తు లేని కారణంలో ఎన్నికల్లో శశికళ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బే.. ఈ పరిణామాలు ప్రతిపక్ష డీఎంకేకు లాభమిచ్చేలా ఉన్నాయి. పన్నీర్ వేసిన ఈ ఎత్తుగడ శశికళకు ఆశానిపాతంలా మారింది..

To Top

Send this to a friend