అవినీతి భయం.. అంతర్మథనం..


అవినీతిని రూపుమాపుతానని శపథం చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో ఆ మేరకు చర్యలు తీసుకోవడంతో మొత్తం కాకపోయినా పై స్థాయిలో అవినీతి కొంత వరకు తగ్గింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా విచ్చలవిడి అవినీతిని తగ్గించలేకపోతున్నారు. గ్రామాలు పట్టణాల్లో లంచాలు లేనిదే ఏ పని జరగని పరిస్థితి. మొత్తం ఆన్ లైన్ వ్యవస్థ చేసినప్పుడే అవినీతిని రూపుమాపడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే పనికాదు..

గత సంవత్సరం ఇదే ఎండాకాలం ఏప్రిల్ -మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలను నిర్వహించారు. అందులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి తమకు అనుకూల ప్రాంతాలను ఉపాధ్యాయులు ఎంచుకున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు డీఈవోలు కూడా సస్పెండ్ అయ్యారు. అందుకే ఈసారి మరో మేనెల రావడం.. బదిలీ దస్త్రం ముఖ్యమంత్రికి చేరడం జరిగిపోయింది..

అయితే అవినీతిని ప్రోత్సహిస్తున్న ఈ బదిలీలను చేపట్టేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అనుమతిచ్చి అవినీతిని ఎందుకు ప్రోత్సహించాలని.. బదిలీల షెడ్యూల్ వేస్తే చాలు ముడుపులు పట్టుకొని బయలు దేరుతున్నారని… ఇప్పటికే సీఎంవోలో బదిలీలపై వందల సిఫారసు లేఖలు ఉండటాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఏళ్ల తరబడి ప్రతి ఎండాకాలంలో నిర్వహించే సాధారణ బదిలీల విధానానికి చెల్లు చీటీ పాడుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీంతో ఈసారి బదిలీలు లేవని తేలిపోయింది.. కేసీఆర్ నిర్ణయం వల్ల అర్హులైన టీచర్లు, భార్యభర్తలున్న టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

To Top

Send this to a friend