గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్గా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. ఈ చిత్రం దాదాపు shనాలుగు అయిదు సంవత్సరాల క్రితం ప్రారంభం అయ్యింది. కాని ఆర్థిక కారణాల వల్ల సినిమా పూర్తి కాకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా పూర్తి అయ్యింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కష్టమే అంటూ ఇప్పుడు అనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాత సి కళ్యాణ్ నిర్మాణం కోసం ఒక ఫైనాన్సియర్ వద్ద ఆరు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు.
ఆ డబ్బు చెల్లించలేక నిర్మాత సి కళ్యాణ్ చేతులెత్తేశాడు. దాంతో ఇప్పుడు ఆ ఎన్నారై తన డబ్బు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడు. తన అప్పు తీర్చిన తర్వాతే సినిమాను విడుదల చేసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బుల్లెట్ విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సెన్సార్ పూర్తి చేయించి కష్టపడి విడుదలకు సిద్దం చేసిన సమయంలో ఇలా కథ అడ్డం తిరగడంతో చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేపటి వరకు ఏదైన విషయం తేలని పక్షంలో సినిమా ఇక పూర్తిగా విడుదల అవ్వడం అసాధ్యం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.
