గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్గా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరగుడుల బుల్లెట్’. దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ఈ సినిమా ప్రారంభం అయ్యింది. అంటే ‘బాహుబలి’ సినిమా ప్రారంభం అయిన సమయంలోనే ఈ సినిమాను దర్శకుడు బి గోపాల్ ప్రారంభించాడు. ఏవో కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా విడుదలకు నోచుకోకుండా విడుదల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.
అయిదు సంవత్సరాల క్రితం వేరే టైటిల్‌తో ప్రారంభం అయిన ఈ సినిమా ఇప్పుడు ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే వారంలో విడుదల కాబోతుంది. సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని, ఇంకా ఆలస్యం చేయవద్దనే ఉద్దేశ్యంతో శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో అద్బుతమైన రికార్డు బ్రేకింగ్ ఫ్యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్లో సంచలనం సృష్టించిన బి గోపాల్ ప్రస్తుతం సక్సెస్ కోసం ప్రాకులాడుతున్నాడు. గత దశాబ్ద కాలంగా గోపాల్ హిట్ మొహం చూసింది లేదు. దాంతో ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
