వెంకయ్య ఉపరాష్ట్రపతి, ఏపీకి అన్యాయం..

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆయనే దిక్కు.. ఢిల్లీలో ఏ పని కావాలన్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా అందరూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గడప తొక్కుతారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వెంకయ్య ఇప్పుడు మోడీకి రైట్ హ్యాండ్ గా కేంద్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తి గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ పని కావాలన్నా వెంకయ్య చిటికెలో చేసి పెడుతూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి, కరెంట్ లొల్లి, ఉద్యోగుల నియమాకాలు కానీ.. ఏపీకి పోలవరం జాతీయ హోదా సహా కేంద్ర పథకాల సాయంలో కానీ వెంకయ్య నాయుడి పాత్ర ఎంతో ఉంది. కేంద్ర ప్రకటించే ప్రతి పథకాన్ని ముందు ఏపీనుంచే ప్రారంభించేస్తారు కేంద్రమంత్రి వెంకయ్య. అంతలా ఏపీకి పాటుపడుతున్న వెంకయ్యను ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉపరాష్ట్రపతిగా బరిలో నిలబెడుతోందనే వార్త తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబును కలవరపెడుతోంది.

వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికయితే ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండలేరు. రాజ్యాంగ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణకు సాయం విషయంలో నిధుల విడుదలలో క్రియాశీలక పాత్ర పోషించలేరు. దీంతో ఇక తెలుగు రాష్ట్రాల మంత్రులు, సీఎంలు ఢిల్లీ వెళితే ఎవరిని సాయం కోరాలనే ప్రశ్న వేధిస్తోంది. సీఎం చంద్రబాబు కేంద్రంలో ఉన్న పెండింగ్ అంశాలపై వెంకయ్య సాయం తీసుకునేవారు. వెంకయ్య లేకపోతే అసలు కేంద్ర ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాలను పట్టించుకునే పరిస్థితి ఉండదన్నది నాయకుల భావన.. సో ఇలా మోడీ .. వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఆఫర్ చేశారన్న ప్రకటన వెలువడగానే నవ్యాంధ్ర నాయకులందరూ షాక్ లో మునిగిపోయారు..

కాగా వెంకయ్య ఉపరాష్ట్రపతి బరిలో నిలవడానికి అనాసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. క్రియాశీల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే ఈ సమయంలో ఎలాంటి కార్యకలాపాలు ఉండని ఉపరాష్ట్రపతిగా వెళ్లాలని అనుకోవడం లేదని.. ఉత్సవ విగ్రహం లాంటి.. రిటైర్ మెంట్ తర్వాతే చేసే ఉపరాష్ట్రపతి తనకు వద్దని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.

To Top

Send this to a friend