వారికి అనుష్క తప్ప మరే దిక్కు లేదు!


తమిళంలో సుందర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న చిత్రం ‘సంఘమిత్ర’. ఈ సినిమాను తమిళ సినీ ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు అంతా కూడా తమిళ బాహుబలిగా చెప్పుకుంటున్నారు. తమిళంతో పాటు ‘బాహుబలి’ విడుదలైనట్లుగా పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సినిమాను భారీగా ఊహించుకుంటున్న సమయంలో హీరోయిన్‌ శృతిహాసన్‌ ఈ చిత్రం నుండి తప్పుకోవడం అందరికి షాక్‌ను కలిగించింది.

శృతిహాసన్‌ దాదాపు రెండు నెలల పాటు ‘సంఘమిత్ర’ చిత్రం సన్నాహక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రత్యేక శిక్షణ కార్యక్రమంతో పాటు, స్క్రిప్ట్‌ చర్చల్లో కూడా పాల్గొంది. అయితే చిత్ర యూనిట్‌ సభ్యుల తీరు నచ్చక పోవడంతో ఈ అమ్మడు సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించింది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించారు. ప్రస్తుతం శృతి హాసన్‌కు ప్రత్యామ్నాయం కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు జల్లెడ పడుతున్నారు.

ఎన్ని విధాలుగా ఆలోచించినా, ఎలా ఆలోచించినా కూడా ‘సంఘమిత్ర’ చిత్రంలో శృతి వదిలేసిన ఆ పాత్రకు అనుష్క అయితే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని, ‘బాహుబలి’ సినిమాతో ఆమె స్థాయి భారీగా పెరిగిందని, దాంతో ఆమెను సంఘమిత్రలో తీసుకోవడం వల్ల మంచి మార్కెట్‌ ఏర్పడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే అనుష్క కత్తి యుద్దంతో పాటు కర్రసాము, గుర్రపు స్వారీ చేసిందని, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల కోసం ఆమె పడ్డ కష్టం, ఆ అనుభవం ‘సంఘమిత్ర’కు ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే అనుష్క ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.

To Top

Send this to a friend