‘భాగమతి’తో రెడీ అవుతున్న దేవసేన

‘బాహుబలి 2’ సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో సక్సెస్‌ను అందుకున్న విషయం తెల్సిందే. దాదాపు 1500 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిన ‘బాహుబలి 2’ సక్సెస్‌ ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పిచ్చ క్రేజ్‌ను తీసుకు వచ్చింది. ఆ క్రేజ్‌ను ఫుల్‌ క్యాష్‌ చేసుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దేవసే అనుష్క కూడా ‘బాహుబలి 2’ క్రేజ్‌ను తన తర్వాత సినిమాకు ఉపయోగించుకునేందుకు సిద్దం అవుతుంది.

చాలా కాలం క్రితమే అనుష్క హీరోయిన్‌గా ‘భాగమతి’ అనే సినిమా ప్రారంభం అయ్యింది. అయితే సినిమా షూటింగ్‌ జరుగుతుందా, అసలు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యిందా అనే విషయాలను చెప్పకుండా నిర్మాతలు దాస్తూ వచ్చాయి. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘భాగమతి’ షూటింగ్‌ తాజాగా పూర్తి అయ్యింది. అందరికి సర్‌ప్రైజ్‌ ఇస్తూ వచ్చే నెల మొదటి లేదా రెండవ వారంలో ప్రభాస్‌ చేతుల మీదుగా ‘భాగమతి’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మరియు టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

‘భాగమతి’ అనేగానే మొదట అంతా కూడా ఛారిత్రాత్మక నేపథ్యం అని భావించారు. కాని ఇదొక రివేంజ్‌ థ్రిల్లర్‌ డ్రామా అని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో కూడా ‘భాగమతి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమాతో మరోసారి అనుష్క భారీ క్రేజ్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ‘పిల్లజమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మించారు. వీరు ప్రభాస్‌కు ఆత్మీయ స్నేహితులు. వీరే ప్రభాస్‌ తర్వాత సినిమా ‘సాహో’ను నిర్మించబోతున్న విషయం అందరికి తెల్సిందే.

To Top

Send this to a friend