అన్నాచెల్లెళ్ల అనుబంధం వెనుక కథ..


ఇన్నాళ్లు ఎప్పుడు ఒక వేదిక మీద కనిపించని కేటీఆర్-కవిత ఇప్పుడు నిజామాబాద్ నియోజకవర్గంలో ఓకేసారి కనిపించారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. ప్రశంసలు కురిపించారు. అన్నయ్యను వేయినోళ్ల పొగిడారు కవిత.. అదే సమయంలో చెల్లెలు గ్రేట్ .. కేసీఆర్ కవిత మాటే వింటారు అని ప్రశంసించారు కేటీఆర్..

ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధం వెనుక పెద్ద కథే ఉంది. సంవత్సర కాలంగా కేటీఆర్ ను పార్టీలో ప్రభుత్వంలో ఫోకస్ చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రస్తుతం తెలంగాణలో నిర్వహిస్తున్న జనహిత బహిరంగ సభల్లో కేసీఆర్ కు బదులు కేటీఆర్ పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు. మరో రెండేళ్లు సమయం మాత్రమే ఎన్నికలకు ఉండడంతో ఇప్పటినుంచే కేటీఆర్ ను తెలంగాణ సమాజంలో తనకు ప్రత్యామ్మాయంగా గుర్తించేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు..

జాగృతి అనే తెలంగాణ సంఘం నుంచి కవిత రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం చాలా కష్టపడ్డారు. కవిత రాజకీయాల్లోకి రావడానికి మొదట్లో కేటీఆర్ అస్సలు ఒప్పుకోలేదు. కుటుంబ పాలన అంటారని.. మొత్తం కుటుంబం రాజకీయ పదవులు నిర్వహిస్తే విమర్శలు వస్తాయని వద్దన్నారు. కేసీఆర్ కు వారసుడిగా తనే ఉండాలని కవితను వద్దన్నారు. కానీ కవిత రాజకీయంగా చాలా చురుకైన పాత్ర పోషించడంతో కేసీఆర్ ఆమెను పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చారు.

అయితే కొద్దికాలంగా కేటీఆర్ ను ఫోకస్ చేయడం.. వచ్చే సారి సీఎం సీట్లో కూర్చొబెట్టాలనుకుంటున్న కేసీఆర్ నిర్ణయానికి ప్రధాన అడ్డంకి హరీష్ రావే.. అందుకే ముందుగా కుటుంబంలో పరిస్థితులు చక్కదిద్దితే హరీష్ ఆట కట్టించవచ్చని కేసీఆర్ ప్రయత్నించారని సమాచారం. అందుకే కేటీఆర్-కవితలను ఒకే తాటిపైకి తేవాలని ఈ బహిరంగ సభను ఉపయోగించుకున్నారు. కవిత అన్నయ్య కేటీఆర్ ను సభకు పిలవడం.. పొగడ్తలు కురిపించడం.. ఇద్దరు ఒక్కటేనన్న భావనను జనంలోకి తీసుకపోవడం జరిగిపోయాయి. ఇలా హరీష్ కు .. వ్యతిరేకులకు కేసీఆర్ కుటుంబం అంతా ఏకతాటిపై ఉందని సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ కు పోటీ లేకుండా చేసుకునేందుకు వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేశారు.

To Top

Send this to a friend