కేంద్ర కేబినెట్‌లోకి అమిత్‌షా.

కేంద్ర‌కేబినెట్ విస్త‌ర‌ణ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడు వెళ్ల‌నున్నారు. దీంతో ఆయ‌న చూసే శాఖ‌లతో పాటు ర‌క్ష‌ణ‌శాఖ‌, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌తో పాటు ప‌లు శాఖ‌లకు మంత్రులు లేరు. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ విస్త‌ర‌ణ‌లో బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా కేబినెట్‌లో చేర‌తారనే ప్ర‌చారం ఢిల్లీలో జోరుగా న‌డుస్తోంది. ఆయనకు హోం, రక్షణ శాఖలలో ఒకటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ నుంచి త్వ‌ర‌లోనే అమిత్ షా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌ కాబోతున్నారు. దీంతో ఆయ‌న కేబినెట్‌లోకి చేరే అవ‌కాశాల కోసమే పెద్దల స‌భకు పంపిస్తున్నార‌ని అంటున్నారు.

అమిత్ షా కేబినెట్‌లోకి వ‌స్తే…పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి రాజస్థాన్‌కు చెందిన ఓపీ మాథుర్‌, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్‌ రేసులో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చేనెల 11వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత కొత్త గవర్నర్ల నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారిస్తార‌ని తెలుస్తోంది. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని కేంద్రంలో కీలక మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

హోం, రక్షణ శాఖల్లో ఏదో ఒకటి అమిత్‌షాకు ఇచ్చి.. స్మృతి ఇరానీని సమాచార, ప్రసారశాఖ పూర్తిస్థాయి మంత్రిగానే నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన అమిత్‌షా తన చతురతతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో, తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటుకున్నారు. అందుకే ఇక ప్రభుత్వ విధానాల్లో ప్రత్యక్షంగా తనదైన ముద్ర వేసేందుకు వీలుగానే మంత్రి పదవిని చేపట్టాలనుకుంటున్నారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది.

To Top

Send this to a friend