కేసీఆర్ కు హెచ్చరికలు పంపిన పత్రికాధిపతి..

‘ప్రస్తుతానికి కేసీఆర్ ను కొట్టే మొగాడు తెలంగాణలో లేడు..’ అది నిజం.. కానీ పరిస్థితులు ఎప్పుడూ అలానే ఉండవు. నిన్నటి రాహుల్ గాంధీ ప్రజాగర్జన విజయవంతం కావడం కేసీఆర్ కు ఓ హెచ్చరిక.. ఆ సభకు పెద్ద ఎత్తున యువకులు రావడం కేసీఆర్ ప్రభుత్వంపై కోపాన్ని చెప్పకనే చెబుతోంది. అందుకే ముందే మేలుకోకపోతే అధికారం నిలవదు అని రాజకీయ విశ్లేషకులు కేసీఆర్ కు ఘంటా భజాయించి చెబుతున్నారు..

కేసీఆర్ చేస్తున్న ప్రచారంతో పోలిస్తే తెలంగాణలో పనులు అంత వేగంగా జరగడం లేదన్నది వాస్తవం.. కాళేశ్వరంలోని మూడు ప్రాజెక్టులు ఇంకా మొదలే కాలేదు. మల్లన్నసాగర్ పట్టాలెక్కలేదు. సాగునీరు లెక్క తేలలేదు. ప్రాజెక్టుల విషయంలో ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఆరంభశూరత్వమే కనిపిస్తోంది. ఇక పథకాలు కాస్త అమలైనా సరే ప్రభుత్వంలో మాత్రం ప్రజలకు సేవలందించే పనులు అంత త్వరగా జరగడం లేదనే అపవాదు ఉంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ 2019 ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలో చెప్పారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. స్వతహాగా ఇద్దరు మంచి మిత్రులైనా సరే.. కేసీఆర్ కు తనదైన శైలిలో చురకలు అంటించి కేసీఆర్ మారాల్సిందేనని రాధాకృష్ణ హెచ్చరికలు పంపారు.

‘కేసీఆర్ లో విమర్శలను స్వీకరించే గుణం లేదు. సహనం అంతకంటే లేదు. కేసీఆర్ ఆలోచనలు.. నిర్ణయాలను విభేదిస్తే శత్రువులా చూస్తాడు. దీంతో శత్రువుల సంఖ్యను కేసీఆర్ పెంచుకుంటున్నారు. అధికారంలో ఉన్న వారికి ఇది మందిది కాదు.. అత్యంత క్లిష్టరాజకీయాలను కూడా పరిష్కరించే కేసీఆర్ లో కాస్త ఓపిక ఉంటే వచ్చే 2019 ఎన్నికల్లో కూడా ఆయనదే అధికారం ’ అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన పత్రికలోని ‘కొత్తపలుకు’ ఎడిటోరియల్ లో కేసీఆర్ కు చురకలు అంటించారు.

కేసీఆర్ కు శత్రువుల సంఖ్య పెరిగిపోతోందని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. కోదండరాంతో పాటు కాంగ్రెస్, టీడీపీ.. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ‘తెలంగాణ ఇంటిపార్టీ’ పేరుతో మరో పార్టీ పురుడు పోసుకుంది. కేసీఆర్ శత్రువుల విషయంలో పలు విషయాల్లో నిర్బంధంగా, కర్కషంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి దాపురిస్తోంది.. అందుకే ప్రజాసమస్యల విషయంలో.. వ్యతిరేకుల విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించాలని ఆ వ్యాసంలో కేసీఆర్ హితబోధ చేశారు. మరి కేసీఆర్ .. ఈ పత్రికా మిత్రుడు సూచించిన సలహాలను పాటిస్తే వచ్చేసారి అధికారంలో ఉంటాడు. లేదంటే.. కష్టాలు తప్పవు..

To Top

Send this to a friend