ఆదర్శమా…అవమానమా!?

నిర్విఘ్నంగా…నిరాఘాటంగా 13 రోజుల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి. చూశారా…చూశారా!! ఎంత గొప్పగా సమావేశాలు నిర్వహించామో…చీమ చిటుక్కుమనలేదు…గుండు పిన్ను నేల పై పడినా శబ్ధం వచ్చింది…ఇంతటి క్రమశిక్షణ వేరొకరికి సాధ్యమా? ఇవి కదా అసలు సిసలు సమావేశాలు…ఇంతకంటే దేశం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఘనతవహించిన విషయం ఏముంది? అని గలాబీదళం ”నొక్కి”వక్కాణిస్తోంది.

దూరపు రాష్ట్రాల నుంచి చూసేకళ్లకు, వినే చెవులకు అదే నిజమన్న భావన కలిగించారు. మరి నిజంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అంత అబ్బురపరిచాయా? ఆ నాలుగు గోడల మధ్య నాలుగు కోట్ల గొంతుల వేధన ధ్వనించిందా!? అంటే లోపల అపరిచితుడు కిసుక్కున నవ్విపోతాడు. బయటకు నవ్వితే నియంత నిప్పులు కురిపిస్తాడు కదా! బహిష్కరణ కత్తులు, వేటు వేసే కొడవళ్లు, ముందరికాళ్లకు బంధాలు, నోటికి తాళాలు బిగించి స్వేఛ్ఛకు చిచ్చు పెట్టి, ప్రతిపక్షానికి పాడికట్టి బోళాగా సభ భళా అనిపించారు.

సభా సమరం జరుగుతోన్న వేళ మహదేవ్ పూర్ అడవుల్లో జింక ఆర్తనాదం చేసింది. ఆమాత్యుల పుత్రరత్నాల వేడుకకు మూగజీవి “వేట”వస్తువు అయింది. భారత శిక్షాస్మృతి ప్రకారం అత్యంత క్రిమినల్ నేరంగా పరిగణించాల్సిన సందర్భంలో ఘనత వహించిన ఆదర్శసభ మూగ వేదికైంది. 150 రూపాయల లంచం ఇవ్వలేని నిస్సహాయత ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వంద రూపాయలు ఇచ్చుకోలేని పేదరికానికి వీల్ ఛైర్ కదలిరానంది. ఇవన్నీ పత్రికల పతాకశీర్షికలే. కానీ, మొద్దుబారిన సభ నిద్రపోయింది.

పదోతరగతి ప్రశ్నాపత్రం లీకైతే పవిత్రసభలో ప్రశ్నించే గొంతుకానరాలేదు. ఓ రెండు గొంతులు మధ్యలో రణగొణ ధ్వనులు చేస్తున్నాయంటూ వాటి పై ఆదిలోనే వేటు పడింది. ఆ రణగొణల మధ్య జనావేధనలు నిక్షిప్తమై ఉన్నాయి. ఏలేవారికి అవి కర్ణకఠోరంగా ఉంటాయి మరి!! అందుకే ఆ రెండు గొంతులు సభలో వినిపించడానికి వీలులేదని హుకుంజారీ చేశారు. ఆ గొంతులు నొక్కమని ఏ సెక్షన్ చెప్పిందో తెలియదు. మరే నిబంధన ఆదేశించిందో అర్థం కాదు. ఇక మిగతా పక్షం మేం సభలో ఉంటే చాలనుకుంది. గొంతు నొక్కినా…హక్కులను తొక్కినారతీసినా…జనం సమస్యల పై చర్చోపచర్చలేకున్నా…

ముఖ్యమంత్రి ప్రసంగం వింటే చాలు పంచాంగ శ్రవణం విన్నట్టేనన్న భావనలో ఓలలూగింది. ఏస్ హావిట్…ఏస్ హావిట్ అంటూ నియంత గొంతుకు వంతపాడింది. ఇదీ ఆదర్శవంతమైన సభ జరిగిన విధానం. ఇప్పుడు చెప్పండి…ఈ సభ ప్రజాస్వామ్యానికి ఆదర్శమా…! అవమానమా!!

To Top

Send this to a friend