నవీన నటనకు భాష్యం “నవీన్ పోలిశెట్టి”


భారతీయ చలన చిత్ర యవనికపై తాజాగా ప్రభావించిన సరికొత్త తారక నవీన్ పోలిశెట్టి, సినిమాలపై అమితమైన ఆసక్తితో, నటనపై అంతులేని అభినివేశంతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, ఎన్నెన్నో త్యజియించి విజయ తీరాలకు చేరువవుతున్న యువ కిశోరం నవీన్ పోలిశెట్టి.ఇంటర్ నెట్ ఆగమనంతో వినోదరంగంలో, సినిమాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులను ఒడిసిపట్టుకొని, అరకొర అవకాశాలకు కూడా ఎదురెళ్లి వాటిని అందిపుచ్చుకొని తనకంటూ గుర్తింపు, రాణింపు పొందిన ఈ తరం కళాకారుడు నవీన్ పోలిశెట్టి, ముంబాయి, పూనే, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, కోల్ కత్త వంటి నగరాలతోబాటు విదేశాల్లోని యువతకు నవీన్ ఓ సూపర్ స్టార్.

వెనుక ముందు గాడ్ ఫాథర్ లు ఎవరు లేకుండా చలన చిత్రసీమ లో అడుగుపెట్టి స్వశక్తితో రాజ్యం ఏలాలి అనుకునే వారికి నవీన్ ఒక రోల్ మోడల్.
నవీన్ కుటుంబంలో అందరు విద్యాధికులు. కజిన్స్ అంతా ఐ.ఐ.టి లో నిట్ లో చదివిన వారే. నటన, సినిమాలు అనేవి వారి ఇంట అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలకు సరి పడదు. అయితే రొటీన్ కు భిన్నంగా ఆలోచించడం నవీన్ లక్షణం. అందరు ఐఐటి, నిట్ లలో సీట్ ల కోసం మాట్లాడుతుంటే, నటన పై అమితమైన ఇష్టంతో ఇంగ్లాండ్ లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

తండ్రి పోలిశెట్టి కృష్ణా రావు కాంగ్రెస్ నాయకుడు. తల్లి శ్రీమతి Manjula మాజీ బ్యాంకు ఉద్యోగి. సినిమాల్లో చేరడానికి ప్రోత్సహించడం అటుంచి నవీన్ తండ్రి బెల్టు తెగేలా కొట్టాడు. అయినా నవీన్ తన పోరాటం ఆపలేదు. తన కలను సాకారం చేసుకొనే క్రమంలో నవీన్ అలసిపోలేదు. క్షణం సైతం లక్ష్యం నుంచి పక్కదారి పట్టలేదు. అందుకే ఈరోజు విజేతగా నిలబడ్డాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంతో తెరంగేట్రం చేశాడు. తరువాత “నేనొక్కడినే” వంటి కొన్ని తెలుగు, హింది చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించాడు

చాల రోజులు ఇంట్లో తెలియకుండా నాటక సంస్థలతో కలసి ప్రదర్శనలు ఇచ్చాడు. ముంబాయి, డిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో నాటక సంస్థలతో కలిసి తిరిగాడు. ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. సంపాదన ఏమి ఉండక పోయినా ఆ సంస్థల్లో అనుభవజ్ఞుల నుంచి నటనలో మెళుకువలు నేర్చుకున్నాడు. నిరంతర అభ్యాసంతో తనలోని ప్రతిభకు సానబట్టాడు. కళాకారుడిగా మరింత ప్రకాశవంతంగా తయారయ్యాడు. చలన చిత్ర సీమ లో కృత్రిమ అయస్కాంతాలకు కోదువే లేదు, అయితే నవీన్ రాకతో ఇప్పుడు సహజమైన అయస్కాంతం వంటి ప్రతిభావంతుడు దొరికినట్లయ్యింది.

సినిమాల్లో అవకాశాలు కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. ఆడిషన్స్ వున్న ఆఫీసులకు ఠంచన్ గా హాజరయ్యే వాడు. అక్షరాల 15 వందల ఆడిషన్స్ కు హాజరయ్యాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే పోయాడు. అవకాశాలు అందినట్లే కనిపించి జారిపోయిన సంఘటనలు వున్నాయి. అయితే, పాత మూస సినిమాలకు, సెంటిమెంటు సీరియళ్ళకు కాలం చెల్లిన తరుణంలో అవతరించిన సరికొత్త మాధ్యమం ఇంటర్నెట్ నవీన్ కు అంది వచ్చిన అవకాశమయ్యింది. యుట్యుబ్ లో ఆల్ ఇండియా బ్యాక్చోద్ (ఐ.ఐ.బి) సీరీస్ “ హానెస్ట్ ఇంజనీరింగ్ “ వీడియోలలో నవీన్ కనబరచిన హాస్యానికి ఉత్తారాధి ఫిదా అయ్యింది. రాత్రికి రాత్రే నవీన్ వైరల్ నటుడయ్యాడు.

ఆంగ్లం, హింది లలో అనర్గళంగా మాట్లాడే సహజ నటుడు కావడం వల్ల నవీన్ ఉన్న ఫళంగా జాతీయ నటుడై పోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశాల సరిహద్దులు చెరిపేస్తూ నవీన్ ప్రతిభ అంతటా జ్వజ్వాలమానంగా వెలుగుతోంది

తెలుగులో సినిమా వచ్చేటప్పటికే వెబ్ సిరీస్ ల ద్వారా నవీన్ వైరల్ నటుడయ్యాడు. నగరాలలోని విద్యావoతులైన యువత నవీన్ సమ్మోహనంలో పడ్డారు. అతని భాషకి, అతని బాడి లాంగ్వేజికి యువత గంగ వెర్రులేత్తి పోయారు. ఈలోగా వచ్చిన “ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ “ సినిమాలో వైవిధ్య భరితము, హాస్య రస ప్రధానమైన డిటెక్టివ్ పాత్రను అతి సుళువుగా పోషించి తెలుగునాట కూడా మంచి గుర్తింపు రాణింపు పొందాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం ఘన విజయం సాధించడంతో తెలుగు పరిశ్రమ ఉలిక్కి పడింది. విజయ దేవర కొండ , కార్తికేయ, శ్రీ విష్ణు వంటి వారు ప్రజాధరణ పొందుతుండగా నవీన్ పోలిశెట్టి ఆగమనం ఫిలిం నగర్ వాలాలను బిత్తర పోయేటట్లు చేసింది.

మనవాళ్ళు కళ్ళు తెరచే లోపే బాలీవుడ్ నవీన్ ను ఎగరేసుకొని వెళ్ళింది. సంచలన విజయం సాధించిన దంగల్ హిందీ చిత్రం దర్శకుడు నితేష్ తివారి తన “ చిచ్చోరే” చిత్రంలో ఆసిడ్ అనే పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. అయితే నవీన్ ది విజయ గాధ అనడంలో సందేహం లేదు అయితే అది ఎంత పెద్దది అనేది ఊహించడం కష్టమే. నవీనమైన నటన, నవ్యమైన కథా వస్తువులను పసిగట్టడంలో నేర్పరితనం, అనుకున్నది సాధించే వరకు మడమ తిప్పని తెంపరితనం ఇవన్నీ కలిపి చూస్తే….

వచ్చే కాలం తప్పకుండా నవీన్ పోలిశెట్టి దే…

టి. వినూత్న తన్మయి

To Top

Send this to a friend