4 బంతుల్లో 92 పరుగులు


క్రికెట్ లోనే ఇది అతి చెత్త రికార్డు.. ముందెన్నడూ లేని విధంగా ఒక్కో ఓవర్ లోనే ప్రత్యర్థిని గెలిపించారు. అదీ వైడ్లు, నోబాల్స్ వేసి.. అరుదైన ఈ మ్యాచ్ క్లబ్ క్రికెట్ లో జరిగింది. ఒక బౌలర్‌ వేసిన నాలుగు బంతుల్లో 92 పరుగులు ఇచ్చాడంటే నమ్మాలనిపించట్లేదు కదా..! అవును ఇది చూస్తే.. నమ్మాల్సిందే. ఈ అసాధారణ రికార్డు బంగ్లాదేశ్‌లోని ఢాకా సెకండ్‌ డివిజన్‌ క్రికెట్‌ లీగ్‌లో నమోదైంది. లీగ్‌లో భాగంగా మంగళవారం ఆక్సియమ్‌, లాల్మాటియా క్లబ్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. లాల్మాటియా జట్టు ఓపెనింగ్‌ బౌలర్‌ సుజన్‌ మహ్మద్‌ నాలుగు బంతులు వేసి 92 పరుగులిచ్చాడు…

నాలుగు బంతులు వేయడంలో భాగంగా.. మొత్తం 15 నోబాల్స్‌ వేశాడు. ఈ క్రమంలోనే 13 వైడ్లు వేయగా ఆ బంతులన్ని ఫోర్లు వెళ్లాయి. ఇక వేయాల్సిన నాలుగు బంతుల్లో 12 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే 80 అదనపు పరుగులు వచ్చాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 92 పరుగులు వచ్చాయి. తొలి ఓవర్‌ మొదటి నాలుగు బంతులకే ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాల్మాటియా జట్టు 14 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగులు వచ్చిన రికార్డు మాత్రమే ఉంది. ఇది కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే సాధ్యమైంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో రెండుసార్లు ఇలాంటి రికార్డు నెలకొల్పినప్పటికీ టెస్టుల్లో మాత్రం నమోదు కాలేదు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధికంగా ఇప్పటివరకు 77 పరుగులు వచ్చిన రికార్డు ఉంది.

ఇలా జరగడానికి కారణమేంటని అడిగితే.. ‘ అంపైర్ల నిర్ణయాల వల్లనే తాము ఇలా చేయాల్సి వచ్చింది. అసలు సమస్య టాస్‌తో మొదలైంది. టాస్‌ ఎవరు గెలిచారో కూడా మా కెప్టెన్‌ను అంపైర్లు చూడనివ్వలేదు. మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయాలన్ని మాకు వ్యతిరేకంగానే వచ్చాయి. దీంతో అసహనానికి గురై నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేశాం.’ అని లాల్మాటియా క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ అదనన్‌ రెహమాన్‌ తెలిపారు.

To Top

Send this to a friend